అవకాశాలు ఎక్కడో ఉండవు.. మన చుట్టూనే ఉంటాయి.. షార్ప్ గా అంది పుచ్చుకోవాలంతే. ఈ విషయంలో నారా లోకేష్ పక్కాగా ఉన్నారు. పక్క రాష్ట్రం స్వహస్తాలతో చేసుకుంటున్న విధ్వంసం కారణంగా వారికి అయ్యే నష్టాన్ని ఏపీకి లాభంగా మార్చేందుకు క్షణాల్లో స్పందించారు.
కర్ణాటక ప్రభుత్వ కేబినెట్ ఓ కొత్త చట్టాన్ని ఆమోదింది. దాని ప్రకారం హై స్కిల్డ్ ఉద్యోగాల్లో అయినా సరే.. ఉద్యోగాల్లో 75 శాతం మందిని కర్ణాటక వాసులనే తీసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీలో బిల్లు ఆమోదించడానికి రెడీ అయ్యారు. సాఫ్ వేర్ ఇండస్ట్రీకి పుట్టినిల్లుగా ఉన్న బెంగళూరులో ఇలాంటి నిబంధన పెడితే.. ఇక ఒక్క కంపెనీ కూడా రాదు కదా..వచ్చే కంపెనీలన్నీ వెనక్కి పోతాయి. అసలు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీపై ఇలాంటి ఆంక్షలు పెడితే కష్టమని తేల్చి చెబుతూ.. సాఫ్ట్ వేర్ కంపెనీల సంఘం నాస్కాం ఓ లేఖ రాసింది.
వెంటనే నారా లోకేష్ అందుకున్నారు. మీ అందరికీ విశాఖ ఆహ్వానం పలుకుతోందన్నారు. కంపెనీలకు కావాల్సిన భూమి, విద్యుత్ ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని విశాఖకు వచ్చేయాలని పిలుపునిచ్చారు. నారా లోకేష్ స్పందన ఇప్పుడు వైరల్ అవుతుంది. బ్యూటిఫుల్ సిటీగా ఇప్పటికే విశాఖకు దేశవ్యాప్త గుర్తింపు ఉంది. ఇప్పుడు లోకేష్ చొరవతో ఐటీ కంపెనీల దృష్టి పడితే.. వెల్లువలా కంపెనీలు వచ్చేస్తాయి.