తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రేపటి నుండి రెండు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీయాలంటే వైకాపాకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాపైనే పట్టు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే నారా లోకేష్ కడపకి ప్రయాణం అవుతున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో మంత్రి కె.టి.ఆర్. చేతిలో ఘోర పరాజయం పొందడంతో నారా లోకేష్ పొలిటికల్ గ్రాఫ్ ఒకేసారి క్రిందకు పడిపోయింది. దానిని మళ్ళీ సరిచేసుకోవాలంటే ఇటువంటి ఘన కార్యమేదో సాధించి చూపాల్సి ఉంటుంది.
కడపలో మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలుంటే వారిలో ఏడుగురు వైకాపాలో ఉన్నారు. కడప మునిసిపల్ కార్పోరేషన్ లో 50 స్థానాలుంటే అందులో 42 వైకాపావే. అలాగే కడప జిల్లా పరిషత్ కూడా వైకాపా చేతిలోనే ఉంది. ఈ పరిస్థితిలో కడపలో తెదేపా పాగా వేయాలంటే తప్పనిసరిగా అక్కడ తన బలం పెంచుకోవలసి ఉంటుంది. అందుకే ‘మిషన్ ఆకర్ష్’ పెట్టుకొని నారా లోకేష్ వైకాపా కంచుకోటలోకి ప్రవేశించి దానిని బ్రద్దలు కొట్టాలని బయలుదేరుతున్నారు.
అయితే కడపలో జగన్మోహన్ రెడ్డికి విశ్వాసపాత్రులుగా ఉన్న ఎమ్మెల్యేలను నేరుగా ఆకర్షించడం కష్టం కనుక ముందుగా వైకాపాలోని రెండవ స్థాయి నేతలను, కార్యకర్తలను తెదేపాలోకి ఆకర్షించే పని పెట్టుకొన్నట్లు సమాచారం. అలాగే కడప మునిసిపల్ కార్పోరేషన్, జిల్లా పరిషత్ సభ్యులపై కూడా లోకేష్ దృష్టి పెట్టవచ్చని సమాచారం. ఇప్పటికే వైకాపాకి చెందిన కడప డిప్యూటీ మేయర్ అరిఫుల్లా తెదేపాలో చేరడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆయనతో బాటు మరికొందరు కార్పొరేటర్లు తరలివస్తే వైకాపాలో చీలిక ఏర్పడుతుంది.
కడపలో తెదేపాకు ఎలాగూ బలం లేదు గాబట్టి వైకాపా నుండి ఎంతమంది వచ్చినా పార్టీలో చేర్చేసుకోవచ్చును. అయితే ఈ ప్రయత్నాలలో నారా లోకేష్ విఫలమయితే అది ఆయనకి, చంద్రబాబు నాయుడుకి, తెదేపాకి చాలా అవమానకరమవుతుంది కనుక ఈపాటికే స్థానిక నేతలు కొంత ‘గ్రౌండ్ వర్క్’ పూర్తి చేసి వైకాపాకు చెందిన కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలను, కార్యకర్తలను తెదేపాలో చేర్చడానికి సిద్దం చేసే ఉంటారని భావించవచ్చును. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టకి భంగం కలిగినట్లవుతుంది.