ఎ.ఒ.యు.. ఈ మాట ఆంధ్రాలో బాగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్కారు వివిధ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు, కొత్త శాఖలను తెరిచేందుకు వివిధ ఐటీ సంస్థలు మొగ్గు చూపుతూ ఉండటం కచ్చితంగా మెచ్చుకోదగ్గ అంశమే. శుక్రవారంనాడు ఏపీ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ హెచ్.సి.ఎల్. సంస్థను సందర్శించారు. ఆ కంపెనీ ఛైర్మన్ శివనాడార్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో దాదాపు 5 వేల మందికి ఉపాధి కల్పించేలా ఆ కంపెనీతో ఎమ్.ఒ.యు. కుదుర్చుకున్నట్టు లోకేష్ తెలిపారు. కేవలం నెలన్నర రోజుల్లోనే ఈ సంస్థ ఏర్పాటుకు అవసరమైన భూముల్ని కేటాయించామనీ, రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ సర్కారు కట్టుబడి ఉంది అని చెప్పారు.
మంచిదే, కొడుకును కంటానని కోడలు అంటే వద్దనే అత్తాగారు ఎవరుంటారు..? నిజానికి, ఆంధ్రాలో చెప్పుకోదగ్గ ఐటీ పరిశమ్రలేవీ ఇంతవరకూ రాలేదు. తాజాగా హెచ్.సి.ఎల్. వంటి దిగ్గజ సంస్థ వస్తుండటం శుభపరిణామమే! దీన్ని చూసి మరో కంపెనీ వస్తుంది. కానీ, ఇదేదో ఇవాళ్లే కుదుర్చుకున్న ఒప్పందంగా మంత్రి నారా లోకేష్ చెబుతూ ఉండటం ఆశ్చర్యంగా ఉంది. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎమ్.ఒ.యు. కుదుర్చుకున్నట్టు ఆయన చెబుతున్నారు. నిజానికి, ఈ ఒప్పందం ఇవాళ్ల కొత్తగా జరిగిందేం కాదు! కొన్నాళ్ల కిందట హెచ్.సి.ఎల్. ఛైర్మన్ శివనాడార్ విజయవాడకు వచ్చారు. గన్నవరం పరిసర ప్రాంతాల్లో తమ సంస్థను నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హెచ్.సి.ఎల్. కంపెనీతో ఒప్పందం కుదిరింది. ఆ వార్త మీడియాలో చాలా ప్రముఖంగా వచ్చింది. గన్నవరం విమానాశ్రయానికి దగ్గర్లో సదరు సంస్థకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాడే ప్రకటించారు. 2018 నాటికి తొలిదశ పనులు పూర్తిచేయాలన్నది నాటి ఒప్పందం. అంతేకాదు, ఈ సంస్థ ద్వారా 5 వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రకటన కూడా నాటి మాటే.
అయితే, ఇప్పుడు నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి… ఇవాళ్లే ఆ సంస్థతో ఒప్పందం కుదిరినట్టూ.. తానే చొరవ తీసుకున్నాను అన్నట్టుగా మాట్లాడం విడ్డూరంగా ఉంది. లోకేష్ ఢిల్లీ వెళ్లింది కేవలం ఆ సంస్థకు సంబంధించిన భూ కేటాయింపు పత్రాలను అందజేయడానికి మాత్రమే అనేది వాస్తవం. కానీ, ఈ సంస్థ ఆంధ్రాకు వచ్చిన ఘనత, రావడానికి జరిగిన చొరవ, ఉద్యోగాల కల్పన క్రెడిట్ ఇలాంటివన్నీ తన ఖాతాలో పడాలని ఆశిస్తున్నారేమో తెలీదుగానీ… గతంలో జరిగిన ఎమ్.ఒ.యు.ను ఇప్పుడే జరిగినట్టు చెప్పుకోవడం చిత్రంగా ఉంది..! ఆ కంపెనీ కొత్తగా వచ్చినట్టు, తన ప్రయత్నంతోనే ఇదంతా జరిగినట్టు చెప్పుకుంటూ ఉండటం వింతగా ఉంది.
మంత్రిగా నారా లోకేష్ ఏదో ఒకటి సాధించాలి కదా! ఎన్నికలప్పుడు చెప్పుకోవడానికి ఏదో ఒక ట్రాక్ రికార్డు కావాలి కదా! పైగా, రెండేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పిస్తా అంటూ వాగ్దానం చేశారు కదా. ఆ లక్షలో ఇవో ఐదువేలు చేర్చుకోవచ్చు.