తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కు నారా లోకేష్ పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన ఆలోచనల్ని వివిధ సందర్భాల్లో పార్టీ నాయకత్వం ముందు, క్యాడర్ ముందు ఉంచుతున్నారు. ఎవరికైనా పార్టీ పదవుల్లో రెండు సార్లు మాత్రమే చాన్స్ రావాలని ఆయన అనుకుంటున్నారు. తర్వాత పై స్థానానికి వెళ్లాలి లేకపోతే గ్యాప్ తీసుకోవాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల యువనేతలకు అవకాశం దక్కుతుంది. ఇతర పదవుల్లోనూ ఆయన ఇదే ఫార్ములాని ప్రిఫర్ చేస్తున్నారు.
యువనాయకుల చేతుల్లోకి టీడీపీ
తెలుగుదేశం పార్టీకి 2019లో అతి పెద్ద సమస్యగా సీనియర్ నేతలు ఉండేవారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నేతలే 2019 వరకూ అన్ని ఉమ్మడి జిల్లాల్లో నిర్ణయాలు తీసుకున్నారు. వారిని పక్కన పెట్టి కనీసం వారి వారసులకు చాన్స్ ఇచ్చేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు పాక్షికంగానే ఫలితాలను ఇచ్చాయి. పార్టీ ఓడిపోవడంతో .. నారా లోకేష్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. మెల్లగా తన పాదయాత్రతో పాటు పార్టీని కూడా చక్కదిద్దారు. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో చూసినా యువనేతలు లీడ్ తీసుకోవడమో.. ప్రత్యామ్నాయంగా రెడీగా ఉండటమో కనిపిస్తోంది. ఇక్కడే లోకేష్ వ్యూహం కనిపిస్తుంది.
పార్టీలో అన్ని స్థాయిల్లో యువరక్తానికి పెద్దపీట
పార్టీలోఅన్ని స్థాయిలో యువరక్తం ఎక్కించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నాయకుల వారసుల్ని కాదనలేరు. అలాగని వారిని నెత్తిన పెట్టుకోవడం లేదు. రాజకీయాలకు తగ్గ అవకాశాల్ని అందిపుచ్చుకుని..కుదిరితే సృష్టించుకునే నేతల్ని లోకేష్ ప్రోత్సహిస్తున్నారు. పార్టీ పోస్టుల భర్తీ విషయంలో అదే ఫార్ములాను పాటిస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ యువకులకు అవకాశాలు కల్పిస్తున్నారు. పార్టీ కోసం గట్టిగా పని చేయగలిగే నేతల్ని ఎంపిక చేసుకోవడానికి నారా లోకేష్ ఓ పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించుకున్నారు.
ప్రతి ఒక్కరికీ అవకాశం వచ్చేలా వ్యూహం
పార్టీలో కానీ.. నామినేటెడ్ పోస్టుల్లో కానీ వారి వారి సామర్థ్యానికి తగ్గ పదవిని కనీసం ఒక్క సారి అయినా వారికి దక్కేలా చేయడానికి నారా లోకేష్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఎవరైనా ఒకే పదవిలో రెండు సార్లు అనే పదవి అనే రూల్స్ గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. పార్టీలో కూడా ఇదే టాపిక్ పై చర్చ జరుగుతోంది. ఈ విధానాన్ని నారా లోకేష్ అవలంభిస్తే.. మంచిదనే వారు మెజార్టీ ఉన్నారు. పదవుల్లో స్థిరపడిపోయిన వారు ఆ పదవి తమ ఆస్తి అని అనుకునే ప్రమాదం ఉంది. ఆ పదవి నుంచి తప్పించినప్పుడు అసంతృప్తికి గురవుతున్నారు. ముందుగానే ఈ టర్మ్ ఇక్కడి వరకే అని తెలిస్తే వారు కూడా మెంటల్ గా ప్రిపేర్ అవుతారు. అసంతృప్తి కూడా తగ్గుతుంది.
నారా లోకేష్ పార్టీని గతంలోలా కాకుండా.. ఓ క్రమపద్దతిలో నిర్మించుకుంటూ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల మంచి ఫలితాలు రావడానికే ఎక్కువ అవకాశం కనిపిస్తోంది