ఏ తండ్రయినా కుమారుడు తనను మించి ఎదగాలని ఆశిస్తాడు. ఇది సహజం! తన కంటే అధిక పాపులారిటీ, అధిక సంపాదన ఉన్న కొడుకును చూసి గర్వపడని తండ్రి ఉంటారా..? అదే రాజకీయ నేతలైతే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే ఆనందాన్ని అనుభవిస్తున్నారని చెప్పుకోవాలి. పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. కుమారుడు పుట్టినపుడు కాదు.. అతని గొప్పదనాన్ని పదిమంది పొగిడిన నాడే ఆ తండ్రికి నిజమైన పుత్రోత్సాహం అని అంటారు కదా! ఇప్పుడు అదే గర్వాన్ని చంద్రబాబు అనుభవిస్తున్నారు. కారణమేంటి.. అనుకుంటున్నారా..?
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. పార్టీ జాతీయాధ్యక్షుడు కమ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కు ఎమ్మెల్సీ సీటు కన్ఫర్మ్ అయింది. ఇంకేం! నామినేషన్ వేశారు లోకేశ్. ఇప్పుడు లోకమంతా లోకేష్ గురించే చర్చించుకుంటోంది. దేనికంటారా? ఇంక దేనికి? లోకేశ్ ఆస్తుల గురించే! లోకేశ్ తనపై దాదాపు రూ.330 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కోనడమే ఇందుకు కారణం. ఏమిటీ.. కేవలం 34 ఏళ్ల కుర్రాడు అంత ఆస్తి ఎలా సంపాదించాడు అని అడగకండి. అది వేరే విషయం ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు పైగా హెరిటేజ్ అనే సంస్థకు ఎండీ కూడా! అదన్న మాట సంగతి. అయితే ఇదంతా మాకెందుకు? ఇంతకీ చంద్రబాబు ఆనందపడాల్సింది ఇందులో ఏముంది? అనుకుంటున్నారా?
ఇక్కడే ఉంది అసలు కిటుకు. ఎందుకంటే ఈ దేశం మొత్తం మీద ఏటా ఆస్తులు ప్రకటించే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడే అన్నది జగమెరిగిన సత్యం. ఆయన ఆస్తి విలువ ఎంతో తెలిస్తే అవాక్కవుతారు. కేవలం రూ.3 కోట్లపై చిలుకు మాత్రమే! ఇంకా మాట్లాడితే హైదరాబాద్లో ఓ పాత ఇల్లు, ఓ డొక్కు కారు, మరికొన్ని పాత వస్తువులు.. అంతే! ఈలెక్కన కుమారుడి ఆస్తిలో పదో వంతు కూడా చంద్రబాబుకు లేకపోవడం ఇక్కడ చర్చానీయాంశంగా మారింది. కేవలం 34 ఏళ్ల తన కుమారుడి ఆస్తుల ముందు తన ఆస్తులు ఎందుకూ కొరగావు. ఔరా.. ఇదేమి వింత? ఏపీలో ఉన్న సంపన్న రాజకీయ నాయకుల్లో అత్యంత పిన్న వయస్కుడు నారా లోకేష్ అని మీడియా ఢంకా బజాయించి చెబుతోంది.
ఇలా కుమారుడిని కొనియాడుతుంటే.. విన్న చంద్రబాబు కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తున్నంత పనయిందని సమాచారం. రాజకీయ రంగ ప్రవేశంతోనే అత్యంత పిన్న వయసు ఎమ్మెల్సీ, అత్యంత ధనిక రాజకీయ నాయకుడు అన్న రెండు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు లోకేష్. పోను పోను.. ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తాడో? రికార్డులు చేయాలన్నా, వాటిని తిరగరాయాలన్నా ఎలానో లోకేష్ మామకు బాగా తెలుసు కదా. ఆయన దగ్గర కాస్త తర్ఫీదు పొందితే ఇంకా చాలా రికార్డులు చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా, నారా వారి వారసుడి ఎంట్రీ రికార్డు మోత అని తమ్ముళ్లు మురిసిపోతున్నారు..!