“నేను చంద్రబాబు అంతటి మంచివాడిని కాదు. ఖచ్చితంగా దెబ్బకు దెబ్బతీస్తానని” లోకేష్ యువగళం పాదయాత్రలో పదే పదే చెప్పేవారు. ఎందుకంటే చంద్రబాబు కక్ష సాధింపులకు పాల్పడరని… తప్పులు చేసినా పెద్దగా పట్టించుకోరని శిక్షలు వేయరని ఎక్కువ మంది నమ్మకం. బయట పార్టీల వాళ్లకే కాదు.. సొంత పార్టీలో కూడా అంతే. అది టీడీపీకి మంచి చేసిందా.. చెడు చేసిందా అన్నది పక్కన పెడితే ఇప్పుడు సీన్ మారింది. అప్పటి టీడీపీ వేరు… ఇప్పటి టీడీపీ వేరు. దానికి తాజాగా జోగి రమేష్తో కలిసి టీడీపీ నేతలు వేదిక పంచుకోవడం.. అనంతరం జరిగిన పరిణామాలే సాక్ష్యం. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడు చంద్రబాబు టీడీపీ… ఇప్పుడు లోకేష్ టీడీపీ!
ఇప్పుడు టీడీపీలో చల్తే.. చల్తే కాదు !
తెలుగుదేశం అంటే ఆ పార్టీలో ఉండే నేతలకు ఓ అభిప్రాయం ఉంది. పార్టీలో ఉంటే ఏమైనా చేయవచ్చు.. ఏమైనా అంటే చంద్రబాబు పిలిచి “తమాషాగా ఉందా?” అని ఓ మాట అని చెప్పి పంపేస్తారు. తర్వాత మన పని మనం చేసుకోవచ్చు అని లీడర్లు అనుకుంటారు. అందుకే ఇతర పార్టీల నేతలతో కలిసి బోలెడన్ని రాజకీయాలు చేస్తూంటారు. అదే సమయంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా టీడీపీ వచ్చినా తమను ఏమీ చేయలేరని అనుకుంటూ ఉంటారు. అందుకే చంద్రబాబు పై అసువుగా ఎటాక్ చేసేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. సొంతపార్టీ నేతుల పార్టీ లైన్ దాటిపోయినా క్షమించడం లేదు. మంత్రి పార్థసారధి, గౌతు శిరీష .. జోగి రమేష్ తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడంపై క్షమాపణలు చెప్పాల్సి రావడమే దీనికి సంకేతం.
పార్థసారధిని చేర్చుకుని మంత్రిని చేశారు – అలాగని ఆ నేతల్ని వదిలేస్తారా ?
పార్థసారధి కూడా ఎన్నికల ముందు వరకూ వైసీపీ నేత. ఆయనను టీడీపీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. మంత్రి పదవి కూడా ఇచ్చారు. టీడీపీ క్యాడర్ ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. స్వాగతించారు కూడా. ఎందుకు .. ఆయన రాజకీయాన్ని రాజకీయంలాగానే చేశారు. బూతులు అందుకోలేదు. చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేయలేదు. కానీ జోగి రమేష్ నీడ కూడా టీడీపీపై పడితే క్యాడర్ అంగీకరించడం లేదు. ఎందుకంటే ఆయన అంత ఘోరంగా వ్యవహరించారు. ఇలాంటి వాళ్లు రెడ్ బుక్ లో ఉంటారు. వాళ్ల సంగతి చూస్తారు కానీ.. వాళ్లతో టీడీపీ నేతలు కనీసం టచ్ లో ఉన్నా క్షమించే పరిస్థితి ఉండదు. నిజానికి పార్టీపై చంద్రబాబు హోల్డ్ ఉన్నట్లయితే.. జోగి రమేష్ ఏంటి.. కొడాలి నాని లాంటి వాళ్లతో కూడా కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ ఇప్పుడు నడుస్తోంది లోకేష్ పార్టీ. అందుకే ఇలాంటివి సహించేది లేదని సంకేతాలు పంపుతున్నారు.
పార్టీ నేతలైనా జాగ్రత్తగా ఉండాల్సిందే !
పార్థసారధి, గౌతు శిరీష .. క్యాడర్ కు సారీ చెప్పాల్సి వచ్చింది. ఇది టీడీపీలోని ఇతర నేతలకు గట్టి సంకేతాలను పంపుతోంది. పార్టీని, పార్టీ అధినేతను.. ఆయన కుటుంబాన్ని గత పదేళ్ల కాలంలో జగన్ రెడ్డికి మానసిక ఆనందం కోసం వేధించిన.. మాటలతో రెచ్చిపోయిన ఏ ఒక్కరితో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకున్నా.. సహించే పరిస్థితులు ఉండవని సంకేతాలు పంపారు. వ్యక్తిగత సంబంధాలు ఏమైనా ఉన్నా బయటపడితే క్యాడర్ నుంచి ఈ స్థాయి వ్యతిరేకతను ఎంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మొదటికే వస్తుంది. లోకేష్ చాలా గట్టిగా ఈ సంకేతాన్ని పార్టీ నేతల్లోకి పంపించేశారు. అందుకే ఇప్పుడు టీడీపీ కూడా పూర్తిగా మారుతోంది. లోకేష్ ముద్ర కనిపిస్తోంది. దానికి తగ్గట్లుగా నేతలు కూడా మారాల్సి ఉంది.