ఇది వరకు యేడాదికి రెండు మూడు సినిమాలైనా వదలేవాడు నారా రోహిత్. ఆ సినిమా హిట్టు ఫ్లాపులతో అస్సలు సంబంధమే లేకుండా, తనకు అవకాశాలు వచ్చేవి. కొన్ని కథలు, కొన్ని పాత్రలు.. ప్రేక్షకులకూ నచ్చేవి. సోలోని మినహాయిస్తే – తన సినిమాలు ఆర్థిక విజయాల్ని అందుకున్న దాఖలాలు లేవు. అయినా సరే.. ఆ స్పీడు తగ్గలేదు. అయితే కొంతకాలంగా నారా రోహిత్ ఖాళీ. వరుస ఫ్లాపుల వల్లో, సినిమాలపై అసక్తి తగ్గడం వల్లో తెలీదు గానీ, ఈమధ్య ఒక్క సినిమా కూడా పట్టాలెక్కించలేదు. సరి కదా… సెట్స్పైకెళ్లిన సినిమాలు సైతం ఆగిపోయాయి.
ఇక నారా రోహిత్ పని అయిపోయిందని అంతా ఫిక్సయిపోయారు. కావల్సిన హీరోలు దొరక్క, రోహిత్‌ని వెదుక్కుంటూ వెళ్తే… ‘నా దగ్గరే కథ ఉంది..’ అంటూ నిర్మాతల్నీ, దర్శకుల్నీ ఊరిస్తున్నాడట. అంతే కాదు.. ‘ఈ సినిమాకి 15 కోట్ల బడ్జెట్ అవుతుంది.. అలాగైతేనే సినిమా చేద్దాం’ అంటున్నాడట. ఇప్పట్లో రోహిత్ తో సినిమా చేయడమే గగనం. అది సరిపోదన్నట్టు… ఇంతింత బడ్జెట్లు పెట్టాలంటే మాటలా..? అందుకే రోహిత్ ని వెదుక్కుంటూ వెళ్తున్న ఆ ఒకరిద్దరు కూడా బడ్జెట్లు చూసి భయపడి వచ్చేస్తున్నార్ట. అలాగైతే… రోహిత్ మరో సినిమా చేయడం కష్టమే.