నారా రోహిత్ డిక్షన్ అమోఘంగా ఉంటుంది. దానికి తోడు మంచి నటుడు. కొత్త కథల్ని ధైర్యంగా ఎంచుకొంటాడు. కానీ ఒకటే లోపం. ఈమధ్య బాగా… బాగా… వళ్లు చేసేశాడు. నారా రోహిత్‌ని పెద్ద తెరపై చూడ్డం కష్టంగా మారుతోంది. హీరో మరీ ఇంత బొద్దుగా ఉంటే ఎలా..?? అనిపిస్తుంది. కథలోంచి, ఆ పాత్రలోంచి డైవర్ట్ అయిపోయే పరిస్థితి వస్తోంది. ఈ విషయం రోహిత్ కూడా గమనించాడు. అందుకే.. ఈమధ్య ఒంటిపై శ్రద్ద పెట్టాడు. తన తాజా చిత్రం `బాలకృష్ణుడు` కోసం సిక్స్ ప్యాక్ చేసే లెవిల్లో బాడీ చూపించబోతున్నాడు. అందుకు తగ్గ వ్యాయామాలు మొదలెట్టాడు. పవన్ మల్లెల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఇందులోని మరో స్టిల్ బయటకు వచ్చింది. అందులో… రోహిత్ స్లిమ్‌గా కనిపిస్తున్నాడు. రెజీనా కథానాయికగా నటిస్తోంది. మణిశర్మ సంగీత దర్శకుడు. షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టే. ఈ విజయ దశమికి టీజర్‌ని విడుదల చేయనుంది చిత్రబృందం. ఇటీవలే.. కథలోరాజకుమారితో ఓ ఫ్లాప్ మూటగట్టుకొన్నాడు రోహిత్. ఈసారి ఈ బాలకృష్ణుడు ఏం చేస్తాడో చూడాలి.