కెరీర్ ప్రారంభంలో వైవిధ్యభరితమైన కథలతో ఆకట్టుకొన్నాడు నారా రోహిత్. తనకంటూ ఓ సెపరేట్ జోనర్ ఉండేది. బాణం, సోలో, ప్రతినిధి.. వేటికవే భిన్నమైనవి. అయితే ఆ తరవాతే రోహిత్ ప్రయాణం గాడి తప్పింది. కథల ఎంపికలో పొరపాట్లు చేశాడు. ఫిజిక్‌పై కూడా దృష్టి పెట్టలేదు. పరాజయాలు వెక్కిరించాయి. దాంతో సినిమాలకే దూరం అయ్యాడు. రోహిత్ ఇక సినిమాలకు స్వస్తి చెప్పాడని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నాడని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ రూమర్సే అని తేల్చేస్తూ ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడు రోహిత్.
తన కెరీల్లో ప్రతినిధి ఓ ప్రత్యేక చిత్రంగా మిగిలిపోయింది. సమాజానికి ఎన్నో ప్రశ్నల్ని సంధించింది. ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తయారవుతోంది. ప్రతినిధి 2 పేరుతో ఈ సినిమాతోనే రోహిత్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే రోహిత్ తప్ప, ప్రతినిధికి పని చేసిన ఏ ఒక్కరూ ఈ టీమ్‌లో లేరు. ఈసారి ఈ కథలో మీడియాని టార్గెట్ చేయబోతున్నాడట. బ్రేకింగ్ న్యూస్‌ల పేరుతో న్యూసెన్స్ సృష్టిస్తున్న టీవీ ఛానెళ్లపై ఈ సినిమా సెటైరికల్‌గా ఉండబోతోందని టాక్. ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కాబోతోంది.