విరామం లేదు… విశ్రాంతి లేదు… రెండు మూడేళ్ళుగా నారా రోహిత్ విపరీతంగా నటిస్తున్నాడు. 2016లో అతను నటించిన ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. 2017లో మూడు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ నారా రోహిత్ నటించిన సినిమా ఏదీ విడుదల కాలేదు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘ఆటగాళ్లు’తో బోణీ కొడుతున్నాడు. దీని తరవాత మల్టీస్టారర్ ‘వీరభోగ వసంతరాలు’ విడుదల కానుంది. ఆ తరవాత రెండు సినిమాలను అంగీకరించాడు. కానీ, షూటింగులు మొదలు కాలేదు. ఎందుకీ గ్యాప్ అంటే… అదంతా నారా రోహిత్ ప్లానే! ఇకనుంచి స్వంతంగా సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకుని కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే… ఏదో ‘బాలకృష్ణుడు’ వంటి కమర్షియల్ సినిమా తప్ప, అతను నటించిన కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ ఏదీ బాగోలేదని ఎవరూ అనలేదు. డబ్బులు తెచ్చిపెట్టకున్నా.. నారా రోహిత్ మంచి సినిమా చేశాడనే ప్రసంశలు తెచ్చాయి. ఎక్కడ తేడా కొడుతుందనే ఆలోచన అతడిలో మొదలైంది. చివరికి, “బయట నిర్మాతలతో చేస్తుంటే… సినిమాలు నా కంట్రోల్లో వుండటం లేదు. అదే స్వంత సినిమా అయితే… అవసరం అనుకుంటే రీషూట్లు చేసుకోవచ్చు. సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూడొచ్చు. అవసరం అయితే ఏడాది సినిమాను పక్కన పెట్టవచ్చు” అని ఓ నిర్ణయానికి వచ్చాడు. స్పీడ్ తగ్గించడానికి కారణం అదేనని మీడియా మిత్రుల దగ్గర నారా రోహిత్ చెప్పాడు. పీబీ మంజునాథ్ దర్శకత్వంలో నటించనున్న ‘శబ్దం’, చైతన్య దంతులూరి దర్శకత్వంలో నటించబోయే సినిమాలకు అతడే నిర్మాత. అలాగే, కమర్షియల్ విజయాలు సాధించే కొత్త కథలను అన్వేషించే పనిలో పడ్డాడట. ఇదీ నారా రోహిత్ నయా ప్లాన్!