లుంగీ, మాసిన గడ్డం, చేతిలో కత్తి, నోట్లో సిగరెట్.. అచ్చం తమిళ హీరోలా ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. కథలో రాజకుమారి ఫస్ట్ లుక్‌లో రోహిత్ గెటప్ అందరినీ ఆకట్టుకొంది. ఇదో డిఫరెంట్ సినిమా అనే ఫీలింగ్ ఫస్ట్ లుక్‌లోనే కలిగేసింది. మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అప్పుడే కాస్తో కూస్తో అంచనాలు పోగడుతున్నాయి. కచ్చితంగా.. రోహిత్ కెరీర్లో మరో డిఫరెంట్ సినిమా అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ కథలో మరో ట్విస్టు ఉంది. అదేంటంటే.. ఈ సినిమాతో రోహిత్ హీరో కాదు.. విలన్! అందుకే అలాంటి గెటప్ వేశాడు. ట్విస్టుకే ట్విస్టు ఏంటంటే.. విలన్ అంటే మామూలు విలన్ కాదు. సినిమా విలన్.
అవును.. కథలో రాజకుమారి సినిమా నేపథ్యంలో సాగే సినిమా. రోహిత్ విలన్ పాత్రలు వేసుకొనే హీరో! తాను ఓ హీరోయిన్ని ప్రేమిస్తాడు. అదే స్టోరీ. కథే కాస్త విచిత్రంగా ఉంది కదూ. సినిమా కూడా అలానే ఉంటుందని తెలుస్తోంది. గతేడాది అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి డీసెంట్ హిట్ అందుకొన్న నారా రోహిత్ ఆ విజయపరంపరని ఈ సినిమాతోనూ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాలో సినిమా అనేది ఎప్పటికీ ఇంట్రస్ట్రింగ్ కాన్సెప్టే. దాన్ని కొత్త దర్శకుడు ఎంత వరకూ డీల్ చేశాడో, రోహిత్ విలన్ గా ఏ మేరకు హీరోయిజం చూపించాడో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.