నారా రోహిత్‌పై ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అతన్నుంచి ఓ సినిమా వస్తోందంటే, కచ్చితంగా విషయం ఉండే ఉంటుందన్న నమ్మకం కలిగేది. కథని నమ్మి ప్రయోగాలు, కొత్త ప్రయత్నాలు చేశాడు. సినిమా ఫ్లాప్ అయినా.. తన ప్రయత్నాన్ని మాత్రం ఎవరూ తప్పుపట్టలేదు. అయితే.. ఏ హీరోకైనా కమర్షియల్ హిట్టు కొట్టాలని,కమర్షియల్ హీరో అనిపించుకోవాలని ఉంటుంది కదా, అందుకే ఆ ప్రయత్నం తానూ చేశాడు. ‘బాలకృష్ణుడు’తో. కానీ… పల్టీకొట్టింది. తనది కాని దారిలో వచ్చి సినిమా చేయడం ఆహ్వానించదగిన పరిణామమే అయినా, ఎందుకో ఈ కొలతలు తనకి సూట్ కాలేదు. ఎవరిదో చొక్కా వేసుకొని కెమెరాముందుకొచ్చినట్టు అనిపించింది. డాన్సులు, ఫైటింగులు చేసినా.. ఎందుకో రోహిత్‌పై పెంచుకొన్న ఇమేజ్‌కి అవి సరితూగలేదనిపించింది. రోహిత్ ఎప్పటిలా కొత్త తరహా ప్రయత్నాలే చేయాలి… అందులోనే కమర్షియల్ అంశాల్ని చూసుకోవాలి తప్ప, ఇలా ఫక్తు ఫార్ములాల జోలికి వెళ్లకపోవడమే మంచిదనిపించింది. అయితే… ఈమధ్య రోహిత్ చేసిన కొత్త తరహా ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వలేదు. కథల ఎంపికలో ప్రావీణ్యం చూపిస్తున్నా, దర్శకుడ్ని నమ్మడంలో మాత్రం తప్పులు చేస్తున్నాడు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం తన కెరీర్‌పై ప్రభావం చూపిస్తోంది. అంతేకాదు… నిర్మాతల విషయంలోనూ రోహిత్ కాస్త జాగ్రత్త చూపించాలి. సినిమా చివర్లో కొచ్చేసరికి.. పబ్లిసిటీ చేసుకోలేక, సరైన సమయంలో సినిమాకి సిద్ధం చేయలేక నిర్మాతలు బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాలపై రోహిత్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరో ఏదో చేశారని, కమర్షియల్ కథలవైపు మొగ్గకుండా, తనకు సూటయ్యే కథల్ని ఎంచుకొంటే బాగుంటుందేమో.. కొత్త తరహా ప్రయత్నాలకు పట్టం కడుతున్న ఈ దశలో – రోహిత్ తాను నమ్మిన బాటలోనే నడిస్తే ఫలితాలొస్తాయేమో.