ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన వాదోపవాదాల్లో తన సతీమణిని వైసీపీ ఎమ్మెల్యేలు కించపరిచే విధంగా మాట్లాడారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. తాను తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు.
కాగా ఈ పరిణామంపై హీరో నారా రోహిత్ స్పందించారు. ”పశువుల కంటే హీనంగా కొందరు నేతలు ప్రవర్తించారు. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని అసభ్యపదజాలంతో దూషించడం దిగ్భ్రాంతికి గురి చేసింది. విధానాలపై రాజకీయ విమర్శలు ఉండాలిగానీ.. కుటుంబ సభ్యులను అందులోకిలాగడం క్షమించరానిది. శిశుపాలుడిలాగే నిన్నటితో వారి వంద తప్పులు పూర్తయ్యాయి. వారి అరాచకాన్ని ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్క తెలుగు దేశం కార్యకర్త.. వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారు. స్థాయిలేని ‘వ్యక్తుల మధ్య రాజకీయాలు చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్న’. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేము మీ వెంటే వుంటాం” అని ఓ నోట్ రిలీజ్ చేశాడు రోహిత్.