బాణం సినిమాతోనే తానో వెరైటీ కథల హీరో అని నిరూపించుకొన్నాడు నారా రోహిత్. మొన్నటి అప్పట్లో ఒకడుండేవాడు వరకూ.. ఈ నారా హీరో ప్రయాణం వైవిధ్యంగానే సాగింది. అయితే… లుక్ లో ఎలాంటి మార్పులూ లేవు. కొత్త కథలు ఎంచుకొంటున్నా.. తనని తాను కొత్తగా చూపించుకొనే ప్రయత్నం మాత్రం చేయలేకపోయాడు. దానికి తోడు బొద్దుగా కనిపించి… బాగా ఇబ్బంది పెట్టాడు. అయితే.. ఇప్పుడు ఓ సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చి, అందరికీ షాక్ ఇచ్చాడు. రోహిత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం… కథలో రాజకుమారి. మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రేమికుల రోజు సందర్భంగా కథలో రాజకుమారి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో రోహిత్‌ని చూసి షాక్ తినాల్సిందే. పంచె కట్టి, గెడ్డం పెంచి, కత్తి పుచ్చుకొని.. వీర మాస్ గా కనిపిస్తున్నాడు. అచ్చం తమిళ సినిమాల్లో హీరోలా ఉన్నాడంటే నమ్మండి. హీరో ఇంత `రా`గా కనిపిస్తున్నాడంటే కథ ఇంకెంత `రా`గా ఉంటుందో అర్థం చేసుకోవొచ్చు. టైటిల్ డీసెంట్‌గా ఉన్నా.. రోహిత్ లుక్ మాత్రం యమమాసీగా కనిపిస్తుంది. మనోడు కూడా కాస్త తగ్గినట్టే అనిపిస్తున్నాడు. మొత్తమ్మీద రోహిత్ ప్రయత్నం ఆకట్టుకొనేలానే కనిపిస్తోంది. రెగ్యులర్ సినిమాలా కాకుండా.. ఏదో డిఫరెంట్ కథనే చెప్పాలని ట్రై చేస్తున్న భరోసా కల్పించింది పోస్టర్. వెల్ డన్ రోహిత్…