ఓడలు బళ్లవుతాయి… బళ్లు ఓడలవుతాయి. రెండింటికీ మధ్య ఒక్క ఫ్లాప్… ఒక్క హిట్ చాలు.
ప్రస్తుతం నారా రోహిత్ పరిస్థితి అలానే ఉంది. ఈరోజు రోహిత్ పుట్టిన రోజు. గతేడాది ఇదే రోజున… నారా రోహిత్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పేపర్లలో యాడ్లొచ్చాయి. ఫేస్ బుక్, ట్విట్టర్లలో మోత మోగించేశారు. రెండు మూడు కొత్త సినిమాలు ప్రకటించారు. అవి ఏవీ పట్టాలెక్కలేదనుకోండి.. అది తరువాతి సంగతి. ఈరోజు ఆ సందడి లేదు. కొత్త సినిమాల కబురు లేదు. కనీసం పేపర్ యాడూ లేదు. ఇది నిజం.
బాణం, ప్రతినిధి సినిమాలతో ఆకట్టుకున్నాడు నారా రోహిత్. కొత్త తరహా కథలకు కేరాఫ్ అడ్రస్ అనుకున్నారు. కానీ.. ఆ తరవాత పరిస్థితి మారింది. రోహిత్ కూడా అందరిలా కమర్షియల్ కథల వైపు మొగ్గు చూపించాడు. ఫైట్లూ, పాటలూ అంటూ ఫార్ములాల వెంట పడ్డాడు. కానీ అవేం నారా రోహిత్‌కి సూటవ్వలేదు. మళ్లీ కొత్తదనం కోసం పాకులాడినా, అలాంటి కథలు అతనికి దొరకలేదు. మరోవైపు.. ఇదే ఫార్మెట్లో సినిమాలు తీసిన కొత్త హీరోలు సక్సెస్ అయ్యారు. హిట్లు కొట్టారు. అవకాశాలు సంపాదించుకున్నారు. నారా రోహిత్ మాత్రం హిట్లు లేక రోహిత్ కాస్త `నో`హిట్ అయ్యాడు. దాంతో అవకాశాలు రావడం మానేశాయి. సెట్స్‌పైకి వెళ్లిన కొన్ని సినిమాలు ఆగిపోయాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేయలేడు, అలాగని మధ్యలో వదిలేయలేడు. దానికి తగ్గట్టు బాడీ షేపప్పై దృష్టి పెట్టలేకపోయాడు. బాగా లావైపోవడం వల్ల ఈజ్ పోయింది. అందుకే.. రోహిత్‌ని పరిశ్రమ, అందులోని వ్యక్తులు మర్చిపోయారు. పైగా టీడీపీ పార్టీ రాజకీయంగానూ బ్యాక్స్టెప్లో ఉంది. పెదనాన్న చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు.. తన చుట్టూ చేరిన `భజన` బృందం ఇప్పుడు లేదు. వాస్తవాలు ఇప్పటికైనా రోహిత్‌కి అర్థమై ఉంటాయి. తనకు కావల్సింది ఒక్క హిట్టు. అదెలా సంపాదించాలో తెలీక సతమతమవుతున్నాడు. ఇప్పుడు రోహిత్ కొత్త కథల వేటలో ఉన్నాడు. కొత్త దర్శకులతో పని చేయాలని ఎదరుచూస్తున్నాడు. అందుకు సన్నాహాలు కూడా భీకరంగానే జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
https://www.youtube.com/watch?v=0MPxzBpuzkE