రివ్యూ: నారప్ప
‘మంచి సినిమాల్ని కెలక్కుండా ఉండడమే మంచిది’
అంటే… ‘అసురన్’ లో మార్పులూ చేర్పులూ చేయలేదన్న నిజాన్ని ముందే ఒప్పేసుకున్నాడన్నమాట. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల ఓ దర్శకుడిగా చెయ్యాల్సింది.. ‘అసురన్’లో ఉన్న ఫీల్.. `నారప్ప`లో క్యారీ చేయడం. దానిపైనే `నారప్ప` జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. మరి.. అది జరిగిందా? లేదా? ధనుష్ జాతీయ అవార్డు సంపాదించిన పాత్రలో వెంకీ ఎంత వరకూ పరకాయ ప్రవేశం చేయగలిగాడు? థియేటర్లో చూడాల్సిన సినిమా `నారప్ప` ఓటీటీకి పరిమితమైపోయిన వేళ… ‘నారప్ప’ థియేటరికల్ ఫీల్ ఇవ్వగలిగిందా? లేదా?
నారప్ప (వెంకటేష్), పండు స్వామి (నరేన్)ల మధ్య ఆస్తికి సంబంధించిన చిన్న తగాదా ఉంది. అది చినికి చినికి.. గాలివానగా మారుతుంది. నారప్ప పెద్ద కొడుకు మునికన్న (కార్తీక్ రత్నం) కి ఆవేశం ఎక్కువ. ఆ ఆవేశంతోనే… పండు స్వామి కొడుకుని కొడతాడు. ఆ తరవాత.. పండుస్వామినీ కొడతాడు. దాంతో.. పండుస్వామి.. మునికన్నని దారుణంగా చంపించేస్తాడు. కానీ నారప్పది ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అయితే నారప్ప చిన్న కొడుకు సీనబ్బ (రాఖీ) మాత్రం తన కోపాన్ని దాచుకోలేకపోతాడు. తల్లి సుందరమ్మ (ప్రియమణి) పడుతున్న బాధ చూడలేక… పండుస్వామిని నరికి చంపేస్తాడు. దాంతో పండుస్వామి మనుషులు సిన్నప్పని చంపడానికి వెంటపడతారు. పండుస్వామి మనుషుల నుంచి తననీ, తన కుటుంబాన్నీ నారప్ప ఎలా కాపాడుకున్నాడు? అన్నదే కథ.
బేసిగ్గా… ఓ తండ్రి ప్రతీకారం ఈ కథ. దానికి సామాజిక అసమానతలు, భూస్వాముల ఆగడాలు జోడించాడు వెట్రిమారన్. `అసురన్` విజయానికి కేవలం కథ మాత్రమే కారణం కాదు. ఆ పాత్రలో ధనుష్ విశ్వరూపం ప్రదర్శించాడు. అందుకే `అసురన్`ని నీరాజనాలు పట్టారు జనాలు. కథాబలం చూసి రీమేక్ చేసేయడం పెద్ద విషయమేమీ కాదు. క్యారెక్టర్, అందులో స్ట్రంత్, ఆ నటుడు ఆ పాత్రకు తీసుకొచ్చిన వైభోగం చూసి, మనసు పడి.. చేసే రీమేక్‌లు చాలా రిస్క్. ఎందుకంటే… అలాంటి కథల్ని సులభంగా అర్థం చేసుకుని తెరకెక్కించొచ్చు గానీ, ఆ పాత్రలో జీవించిన నటీనటులకు రిప్లికా వెదికి పెట్టడం చాలా పెద్ద టాస్క్. `అసురన్`లో అది కనిపిస్తుంది.
ముందే చెప్పినట్టు కథాపరంగా దర్శకుడు ఎలాంటి మార్పూ చేర్పూ చేయలేదు. ఓరకంగా చెప్పాలంటే… ఫ్రేమ్ టూ ఫ్రేమ్ మక్కీకి మక్కీ దించేశాడు. ఓ జిరాక్స్ కాపీలా. `అసురన్` చూడని వాళ్లకు కథా నేపథ్యం, పాత్రల ప్రవర్తన, మూడ్ ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. వెంకీని ముగ్గురు పిల్లల తండ్రిగా చూడడమే కొత్త. కాబట్టి – `నారప్ప` ప్రారంభం నుంచే ఆసక్తిని రేకెత్తిస్తుంది. నారప్ప తన కుటుంబంతో సహా… అడవిలో దాక్కోవడానికి చేసిన ప్రయత్నాలు, తనని శత్రుమూక వెంబడించిడం – ఆ తరవాత.. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో కథగా చెప్పడం ఇవన్నీ పట్టుసడలకుండా సాగిన సన్నివేశాలు. విశ్రాంతి ముందొచ్చే ఫైట్ లో తన తండ్రి విశ్వరూపాన్ని కొడుకు అర్థం చేసుకోవడమే కాదు… ఈ కథలో ఉన్న గాఢత, నారప్ప పాత్రకున్న కెపాసిటీ రెండూ ప్రేక్షకుడికీ అర్థమవుతాయి.
ద్వితీయార్థంలో నారప్ప ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అందులోనూ ఎమోషన్స్ కట్టిపడేస్తాయి. ముఖ్యంగా `చెప్పుల ఎపిసోడ్` ఆనాటి అసమానతల్ని ఎత్తి చూపిస్తుంది. ఓ వర్గానికి ఇలాంటి అన్యాయం జరిగిందా? అనిపిస్తుంది. ఆయా సన్నివేశాల్ని దర్శకుడు బాగా డీల్ చేశాడు. ఇదంతా.. `అసురన్` మాతృక తెరకెక్కించిన వెట్రిమారన్ కి దక్కుతుంది. అయితే ఆయా సన్నివేశాల్లో వెంకీ యంగ్ లుక్ కాస్త ఇబ్బంది పెడుతుంది. ఓల్డ్ లుక్ లో వెంకీ ఎంత పర్ఫెక్ట్ గా ఇమిడిపోయాడో… యంగ్ లుక్ లో… అంత ఇబ్బందిగానూ కనిపించాడు. తమిళంలో చేసిన అభిరామినే ఇక్కడా చేసింది. ఆ ఇద్దరి మధ్యా ఏజ్ గ్యాప్ చాలా కనిపిస్తుంది. ఇక్కడ `అసురన్`తో పోలిక తేకూడదు గానీ.. `అసురన్`లో ఆ ఎపిసోడ్ బాగా పండడానికి కారణం.. ధనుష్. తను ఇంకా యువకుడే కాబట్టి…ఆయా సన్నివేశాల్లో బాగా ఇమిడిపోయాడు. ధనుష్ లాంటి నటుడు.. అరవై ఏళ్ల వృథుడిగా కనిపించడమే `అసురన్`కి ఓ ప్రత్యేకత తీసుకొచ్చింది. అది వెంకీ చేసినప్పుడు కనిపించదు. ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే… కథ క్లైమాక్స్ కి చేరుతుంది. ఇది రెండు కుటుంబాల కథ అని దర్శకుడు పూస గుచ్చినట్టు చెప్పినా – ఇది రెండు వర్గాల కథ… అన్న సంగతి ప్రేక్షకుడికి అర్థమవుతుంది. ఈ కథలో ఎక్కడా కులం ప్రస్తావన రాదు. వర్గాల ప్రస్తావన అంతకంటే రాదు. కానీ… ప్రేక్షకుడికి ఇవ్వాల్సిన హింట్ ఇస్తూనే ఉంటాయి సన్నివేశాలు.
ఈ పాత్ర చేసినందుకు ధనుష్ కి జాతీయ అవార్డు దక్కింది. వెంకీ ఏమాత్రం తక్కువ చేయలేదు. నిజానికి ఓల్డ్ లుక్‌లో.. ధనుష్ కంటే వెంకీ బాగా చేశాడు. తన ఎక్స్ప్రెషన్స్, ఆ పాత్రని ఆవాహన చేసుకున్న విధానం, డైలాగ్ డెలివరీ.. వీటన్నింటిలోనూ కొత్త వెంకీ కనిపిస్తాడు. ప్రియమణి పర్ఫెక్ట్ గా సూటయిపోయింది. కార్తీక్ రత్నం కంటే రాఖీ (చిన్న కొడుకు పాత్ర చేసిన అబ్బాయి)కే ఎక్కువ సీన్లు పడ్డాయి. తన నటన కూడా అత్యంత సహజంగా ఉంది. నరేన్, నాజర్, రాజీవ్ కనకాల, రావు రమేష్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
మణిశర్మ ఇచ్చిన పాటలు వినడానికి బాగున్నాయి. నేపథ్య సంగీతంలోనూ ఓ ఎమోషన్ పండింది. `రా.. నరకరా..` పాట వెంకీ ఉగ్రనరసింహరూపానికి తగ్గట్టుగానే సాగింది. శ్రీకాంత్ అడ్డాల `అసురన్` కథని అర్థం చేసుకుని, ఆ ఆత్మని తర్జుమా చేయడానికి శక్తి వంచన లేకుండా పని చేశాడు. బహుశా… `ఉన్నది ఉన్నట్టు తీయ్` అని చెప్పే ఈ ప్రాజెక్టు తనకు అప్పగించి ఉంటారు. కాబట్టి.. తాను కూడా చెప్పిన పని చెప్పినట్టు చేశాడు. రాయలసీమ మాండలికంలో సంభాషణలు సాగినా… కొన్ని చోట్ల మామూలు తెలుగు మాటలు వినిపిస్తుంటాయి. యాస విషయంలో ఇంకాస్త అథెంటిసిటీ పాటిస్తే బాగుండేది.
మొత్తానికి `నారప్ప` `అసురన్`కి ఓ జిరాక్స్ కాపీలా కనిపిస్తుంది. ఇక్కడ కొత్తగా చెప్పిందేం లేదు. కొన్ని చోట్ల… ఎమోషన్లు తిరిగి పండించగలిగినా చాలా చోట్ల `అసురన్`లోనే బాగుంది… అనే భావన కలిగిస్తుంది. సెకండాఫ్ సుదీర్ఘంగా సాగడం, డిటైల్ నేరేషన్ పేరుతో సన్నివేశాల్ని కాస్త లెంగ్తీగా తెరకెక్కించడం మైనస్లుగా కనిపిస్తాయి. థియేటర్లో చూస్తే బాగుండేది కదా.. అన్న ఫీలింగ్ మాత్రం కలగదు.