టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీ మొదటగా గెలిచే సీటుగా నర్సాపురం చెప్పుకోవచ్చు. పశ్చిమగోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గమైన నర్సాపురంలో గతంలో కాంగ్రెస్ కంచుకోట. కానీ రాను రాను బలహీనపడింది. నరసాపురం అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ నేత ముదునూరి ప్రసాద్‌రాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో ఆయన గట్టెక్కారు. జనసేన రెండో స్థానంలో ఉంది. ఈ సారి వైసీపీ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలుపు జనసేనదేనన్న అంచనాలు ఉన్నాయి.
2019 ఎన్నికల్లో రెండో స్థానంలో జనసేన
2019 ఎన్నికల్లో జనసేన ఇక్కడ రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువ . జనసేన ఇంచార్జిగా ఉన్న బొమ్మిడి నాయకర్.. మరోసారి పోటీలో నిలిచేందుకు సిద్ధం అవుతున్నారు కాపులతో పాటు ప్రభావం చూపేలా రాజులు ఉంటారు. దళితుల ఓట్లూ ఎక్కువే. మత్స్యకారులు కూడా ఇరవై వేల మంది వరకూ ఉంటారని అంచనా. ఈ క్రమంలో అత్యధికంగా ఉన్న కాపులకే ఎక్కువ పార్టీలు టిక్కెట్లు కేటాయిస్తూ ఉంటాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ గెలవకపోయినా రెండో స్థానంలో నిలిచింది. జనసేన పార్టీ కూడా గత ఎన్నికల్లో స్థానంలో నిలిచింది. రెండు సార్లు ఓట్లు చీలిపోవడం వల్ల ఓ సారి కాంగ్రెస్, మరోసారి వైసీపీ విజయం సాధించింది. 2014లో జనసేన పార్టీ పెట్టినా పోటీ చేయలేదు. టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అందుకే అప్పుడు టీడీపీ అభ్యర్థి బండారు మాధవనాయుడు విజయం సాధించారు.
మత్స్యకార వర్గానికి టిక్కెట్ కేటాయిస్తున్న పవన్ కల్యాణ్
జనసేన తరపున గత ఎన్నికల్లో పోటీ చేసినా బొమ్మిడి నాయకర్ కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన మత్స్యకార వర్గానికి చెందిన నేత. అయినప్పటికీ పవన్ కల్యాణ్ దగ్గర మంచి పలుకుబడి ఉండటంతో ఆయనకే సీటు ఖరారు అవుతుంది. జనసేన పార్టీ అభ్యర్థికి సామాజికవర్గంతకో సంబంధం లేకుండా.. కాపులంతా అండగా నిలబడతారని.. గత ఎన్నికల్లో ఓటింగ్ సరళి కనిపిస్తోంది.
టీడీపీలో వర్గ పోరు – కేటాయించాలని కూడా అడగడం కష్టమే !
నర్సాపురం నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కుంచుకోట. టీడీపీ తరపున కొత్తపల్లి సుబ్బారాయుడు కీలక నేతగా ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. కానీ రాజకీయంగా ఆయన పలు పార్టీలు మారడంతో ప్రభావం కోల్పోయారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు. ఆయన టీడీపీలో చేరినా టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు. తర్వాత టీడీపీ నుంచి బండారు మాధవనాయుడు వంటి నేతలు తెరపైకి వచ్చినప్పటికీ.. పార్టీ కంచుకోటను కాపాడటంలో విఫలమయ్యారు. పలువురు నేతలు టిక్కెట్లకోసం పోటీ పడే పరిస్థితి ఉండటంతో… వర్గ పోరాటాన్ని నివారించడానికైనా సరే ఈ సీటును జనసేనకు ఇవ్వక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
రాజకీయ కారణాలు పక్కన పెడితే నర్సాపురం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో కనీసం రోడ్లు కూడా వేయకపోవడం చిన్న చిన్న పనులు కూడా చేయకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. రైతులకు గత ప్రభుత్వం వచ్చే అనేక పథకాలు నిలిచిపోయాయి. అక్వా పరిశ్రమలకూ ప్రోత్సాహకాలు అందలేదు. సంక్షేమ పథకాల లబ్దిదాదరులపైనే ప్రభుత్వం ఎక్కువ ఆశలు పెట్టుకుంది. కానీ అవీ సరిగ్గా రావడం లేదన్న కోపం ప్రజల్లో ఉంది.