నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులుకు మరోసారి ఘోర అవమానం జరిగింది. ఆయన సమక్షంలో జరిగిన గొడవలో వైసీపీ కార్యకర్త తప్పు చేయకపోయినా హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఈ విషయంలో ఆయన ఎస్పీకి ఫోన్ చేయించి.. విచారణ జరిపించి.. సీఐను సస్పెండ్ చేయించారు. కానీ తమ తప్పు ఎక్కడ బయటపడుతుందో.. ఎక్కడ అల్లరి పాలవుతామనుకున్నారో ఏమో కానీ రైతును మాత్రం జైలు నుంచి బయటకు తీసుకు రాలేదు. అయితే ఇప్పుడు సీఐ సస్పెన్షన్ కూడా రెండు రోజుల్లోనే ముగిసిపోయింది.
ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని పై స్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతో ఎత్తివేశారు. ఆ ఉత్తర్వులను ఆ సీఐనే వాట్సాప్‌లో వైరల్ చేసుకున్నారు. ఇది ఎంపీకి సీఐ చేసిన సవాల్‌గా భావిస్తున్నారు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వల్లే ఇదంతా జరగడంతో ఆయన నేరుగా సీఎం వద్దకు వెళ్లి.. సీఐ మన పార్టీ కోసమే పని చేశారని చెప్పి.. పని పూర్తి చేసుకొచ్చారు. కానీ వైసీపీ పెద్దలు మాత్రం… ఆ బాధితుడు కూడా వైసీపీ అనే సంగతి మర్చిపోయారు.
కింది స్థాయి కార్యకర్తలకు వైసీపీలో ఏ మాత్రం గౌరవం దక్కడం లేదని.. సొంత పార్టీ నేతలే వేధిస్తున్నారన్న పలు చోట్ల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇది పార్టీకి మచిది కాదన్న సంకేతాలు వస్తున్నా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. వినుకొండలో ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉందని రైతు నరేంద్ర ఉదంతమే తెలుస్తోందంటున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సొంత మండలం అయినప్పటికీ వైసీపీ ఓడిపోయింది. ఈ పరిస్థితిని చూసి అయినా వైసీపీ హైకమాండ్ మారాలన్న సూచనలు ఆ పార్టీ క్యాడర్ నుంచి వస్తున్నాయి.
ఎంపీ లావును వైసీపీ హైకమాండ్ దూరం పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయనను చిలుకలూరిపేట ఎమ్మెల్యే కూడా తరచూ అవమానిస్తూంటారు. ఆ విషయంలోనూ అక్కడి ఎమ్మెల్యేకే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. మధ్యలో ఎంపీ మాత్రం పలుకుబడి విషయంలో సన్నబడిపోతున్నరు.