ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి మోడీ వ్యక్తిత్వ విశ్లేషణ పేరుతో కొత్త ఆర్టికిల్ సిరీస్ ఈరోజు ప్రారంభించింది. దీని రచయిత సి.నరసింహారావు. ఇప్పటి తరం ప్రేక్షకులకు- టీవీ చర్చల్లో ఒక విశ్లేషకుడిగా మాత్రమే ఈయన తెలుసు. అయితే ఈయన పూర్తి వివరాల గురించి చర్చించే ముందు, ఇప్పుడు ఈయన ప్రారంభించిన మోడీ విశ్లేషణ ఆర్టికిల్ గురించి చూద్దాం. ఇంతకీ ఈయన ఏమంటాడంటే- మోడీ ఒక పట్టువదలని విక్రమార్కుడని, తలచుకుంటే ఏదైనా సాధించేదాకా వదిలిపెట్టని మొండిఘటం అని విశ్లేషించాడు. అదే ఆంధ్రజ్యోతి ఛానల్లో మాట్లాడుతూ మోడీని రక్తపిపాసి అని కూడా విమర్శించాడు. కాబట్టి మొత్తానికి అర్థమయ్యేది ఏంటంటే నరసింహారావు గారి తదుపరి కథనాలన్నీ కూడా మోడీ వ్యక్తిత్వాన్ని చీల్చి చెండాడుతాయని అర్థం చేసుకోవచ్చు.దీంతో సహజంగానే బిజెపి తరపునుంచి విమర్శలు, వివాదాలు కూడా మొదలయ్యాయి. అయితే ఈయన రాసినంత మాత్రాన ప్రజలందరూ నమ్మేస్తారా అన్నది మరొక ప్రశ్న. దీనికి సమాధానం చూసేముందు ఈయన గురించి కాస్త పరిశీలిద్దాం .
1990 దశకం తొలినాళ్ళలో “రేపు” అనే పేరుతో ఒక మాస పత్రిక వచ్చేది. పూర్తిగా సైకాలజీ అనే సబ్జెక్ట్ మీద తెలుగులో వచ్చిన తొలి మాసపత్రిక ఇది.దీనికి ఆయనే సంపాదకుడు. ఆ తర్వాత వ్యక్తిత్వ వికాసం అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. అది ఎంత సంచలన విజయం సాధించింది అంటే- అప్పట్లో యండమూరి నవల పేరుతో అమ్మకాల్లోఉన్న రికార్డులను ఈ పుస్తకం బద్దలు కొట్టింది. ఈ పుస్తకం సాధించిన విజయమే ఆ తర్వాత యండమూరి లాంటి వాళ్లు కూడా విజయానికి అయిదు మెట్లు లాంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలవైపు మొగ్గుచూపేలా చేసింది అని చాలామంది అంటూంటారు .
అయితే ఈయనకి ఉన్న మరొక హాబీ ప్రముఖుల వ్యక్తిత్వాలను విశ్లేషించడం. ఇప్పుడు మోడీ వ్యక్తిత్వం విశ్లేషిస్తున్న ఈయన 2012 సమయంలో జగన్ వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ ఒక పత్రికలో కొన్ని కథనాలు రాశారు. ఆ కథనంలో జగన్ వ్యక్తిత్వం గురించి ఆయన రాసిన కొన్ని వ్యాఖ్యల్లో ఒకటి ఇది- ” కోళ్ల ఫారం యజమానికి తన కోళ్ల మీద ఎంత ప్రేమ అయితే ఉంటుందో, జగన్ కి కూడా ప్రజల మీద అంతే ప్రేమ ఉంటుంది . తన అవసరం తీరేవరకూ కోళ్ల ఫారం యజమాని కూడా కోళ్లను బాగానే చూసుకుంటాడు.” అయితే ఆ తర్వాత ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన చిరంజీవి కూడా జగన్ గురించి సరిగ్గా ఇవే వ్యాఖ్యలు చేశారు. మిగిలిన కాంగ్రెస్ నేతలు కూడా ఈ వ్యాఖ్యలు అప్పుడప్పుడు వల్లెవేశారు. అంటే ఈయన రాసిన వ్యాసాల్లోని వాక్యాలను ఫాలో అయి, ఎవరికి కావలసినవి వాళ్లు వాడుకుంటున్నారన్నమాట.
అయితే ఇంకా కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే, 2003 ప్రాంతంలో ఇదే నరసింహారావు గారు చంద్రబాబు గురించి విశ్లేషిస్తూ ఒక వార్తా పత్రికలో వరుస కథనాలు రాశారు . అప్పుడు చంద్రబాబు గురించి విశ్లేషిస్తూ ఆయన రాసిన వ్యాఖ్యలు తదుపరి కాలంలో కాంగ్రెస్ కు బాగా ఉపయోగపడ్డాయి. ఉదాహరణకు “చంద్రబాబు తన నీడను తానే నమ్మడు, అలాగే చంద్రబాబు తాను ఎలాగైతే వెన్నుపోటు ద్వారా అధికారం చేజిక్కించుకున్నాడో, అలాగే తనను కూడా ఎవరైనా వెన్నుపోటు పొడుస్తారేమో అన్న అనుమానం ఎప్పటికీ చంద్రబాబు కి అంతర్లీనంగా అలాగే ఉంటుంది, అందుకే ఆయన ప్రతి ఒక్కరిని ప్రతి సంఘటనను అనుమానిస్తుంటారు” ఇలా సాగుతుంది నరసింహ రావుగారి విశ్లేషణ. మరొక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు మీద ఆయన ప్రత్యర్థులు చేస్తున్న విమర్శల్లో చాలా వాక్యాలు ఆయన అప్పటి విశ్లేషణ వ్యాసాల నుంచి తీసుకున్నవే.
ఇప్పుడు ఆయన మోడీ గురించి వ్రాస్తున్న ప్రతికూల వ్యాఖ్యలు నిజమేనని నమ్మేవాళ్ళు, ఆయన పదిహేనేళ్ల క్రితం చంద్రబాబు గురించి రాసిన వ్యాఖ్యలు కూడా నిజమేనని అంగీకరించాల్సి ఉంటుంది. అలాగే చంద్రబాబు గురించి రాసిన విశ్లేషణ బాగుందని అనేవాళ్లు జగన్ గురించి ఆయన రాసిన విశ్లేషణ కూడా నిజమేనని, సరైనదేనని అంగీకరించాల్సి ఉంటుంది.
అయితే అసలు ఈయన విశ్లేషణలంతా బూటకమని, ఈయనకు అంత సీన్ లేదని వాదించే వాళ్ళు లేకపోలేదు. ఈయన సోనియా గాంధీ గురించి కథనాలు రాసినప్పుడు జీవితంలో ఒక్కసారి కూడా సోనియా గాంధీని కలవని ఈయన, పత్రికలు టీవీ చానళ్లలో ఆవిడ గురించి వచ్చే వార్తలు చూసి ఏదో ఆవిడ పక్కనే ఉండి చూసినంత గొప్పగా ఆవిడ గురించి విశ్లేషించి రాయడం హాస్యాస్పదమని అంటూ ఈయన విశ్లేషణ లన్నింటిని చీల్చిచెండాడారు మరికొందరు. ఇదే లాజిక్, మోడీ మీద ఆయన ఇప్పుడు మొదలుపెట్టిన కథనాలకు కూడా వర్తిస్తుంది.
అలాగే ఈయన మీద మరొక విమర్శ కూడా ఉంది. నిజానికి ఆ విమర్శ ఈయన ఒక్కరి మీదే కాదు గాని వ్యక్తిత్వ వికాసం రచయితలందరి మీద ఉంది. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు వ్రాస్తూ -ఈ పుస్తకంలోని అంశాలను ఆచరిస్తే జీవితంలో ఎంతో అత్యున్నత స్థాయికి ఎదుగుతారని ప్రజలను ప్రేరేపించే ఈయన, ఈయన లాంటి పలు రచయితలు, వారెందుకు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగలేదు. కేవలం ఒక విమర్శకుడు విశ్లేషకుడు స్థాయిలోనే ఎందుకు ఆగిపోయారు అనేది ఆ విమర్శ. ఈయననే కాదు కానీ వ్యక్తిత్వ వికాస రచయితలందరి మీద కూడా ఈ విమర్శ ఉంది.
అయితే ఒక విషయం సుస్పష్టం. 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు మీద, 2012లో జగన్ మీద, ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ముందు మోడీ మీద చేస్తున్న ఈ విశ్లేషణలకి, ప్రచురిస్తున్న పత్రికలకి ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేకుండా పూర్తి స్వచ్ఛందంగా, నిష్పాక్షికంగా ఇదంతా చేస్తున్నాయని నమ్మేవారు అయితే తక్కువే. అలాగే ఆయన విశ్లేషణలను రాజకీయ కారణాలతో ఆమోదించేవారు ఉన్నట్లయితే వారు ఆయన గతంలో చేసిన మిగతా విశ్లేషణలను కూడా అంగీకరించాల్సి ఉంటుంది
-జురాన్