తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పదవీ కాలం చివరికి వచ్చింది. కొద్దిరోజుల్లో ఆయన రెండో టెర్మ్ ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో ఆయన్ని మరోసారి గవర్నర్ గా కొనసాగిస్తారా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే రెండు టెర్ములు ఆయన గవర్నర్ గా ఉన్నాడు. ఇప్పుడు మూడోసారి కూడా తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కొనసాగిస్తే… అది రికార్డే అని చెప్పాలి.
అయితే, గవర్నర్ నరసింహన్ విషయంలో ఎందుకింత ఆసక్తి నెలకొందంటే చాలా కారణాలున్నాయి. నిజానికి, ఈయన కాంగ్రెస్ హయాంలో ఏపీకి గవర్నర్ గా వచ్చారు. యూపీయే హయాంలో 2007లో ఛత్తీస్గఢ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఆ తరువాత, ఏపీ గవర్నర్ గా ఎన్డీ తివారీ వైదొలగడంతో నరసింహన్ ఏపీకి వచ్చారు. 2012లో అధికారికంగా ఏపీ గవర్నర్ అయ్యారు. ఇక, తరువాత తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తెలుగు రాష్ట్రాలకు ఆయన ఉమ్మడి గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, ఒక దశలో తెలుగుదేశం పార్టీ ఆయనపై చాలా విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. ఈ మధ్య ఫిరాయింపు రాజకీయ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ని మరోసారి కొనసాగించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. నిజానికి ఆయన యూపీయే హయాంలో గవర్నర్ గా నియమితులైనా.. భాజపా సర్కారుతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో కూడా మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. పైగా, ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారుగా ఉంటున్న అజిత్ ధోవల్, నరసింహన్ లు ఒకే బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్లు. సో.. ఈ స్నేహం వల్ల కూడా నరసింహన్ పదవీ కాలం మరోసారి పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఇంకా క్లారిటీ రావాల్సిన మరో కీలకాంశం ఏంటంటే.. గడచిన మూడేళ్లుగా ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ ఉంటూ వచ్చారు. అయితే, ఇప్పుడు రెండు రాష్ట్రాలకూ కొత్తగా ఇద్దర్ని గవర్నర్లుగా నియమిస్తారా.. లేదంటే, నరసింహన్ నే మరోసారి ఉమ్మడి గవర్నర్ గా నియమిస్తారా అనేది మరింత క్లారిటీ రావాల్సిన అంశం.