గవర్నర్ నరసింహన్ అంటే.. టీఆర్ఎస్కు.. ముఖ్యంగా కేసీఆర్ కు.. అత్యంత సన్నిహితుడు. కేసీఆర్ సర్కార్ పై ఫిర్యాదులు చేయడానికి ఇతర పార్టీల నేతలు వస్తే.. వారితోనూ వాదనకు దిగేంత ఆప్యాయత.. గవర్నర్కు ఉంది. అయితే.. ఇప్పుడు గవర్నర్ మారిపోయారు. వ్యక్తిగా నరసింహనే ఉన్నారు. కానీ.. ఇప్పుడు.. ఆయన గవర్నర్ గా వ్యవహారశైలిని మార్చేశారు. కేసీఆర్ సర్కార్ పై… నిబంధనల అస్త్రం ఝుళిపిస్తున్నారు. మున్సిపల్ బిల్లును నిలిపివేయడమే దీనికి కారణం.
గత ఐదేళ్లుగా ఏ బిల్లు విషయంలోనూ గవర్నర్ మున్సిపల్ బిల్లును పక్కన పెట్టినట్లుగా వ్యవహరించలేదు. ప్రభుత్వం ఏది పంపినా వెంటనే ఆమోదించారు. 2018లో ఆమోదించిన పంచాయతీరాజ్ చట్టంలో ఎన్నికల తేదీలను సూచించే అధికారం ప్రభుత్వానికే అప్పగించారు. దీనిపై అప్పుడు గవర్నర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కానీ ఇప్పుడు మున్సిపల్ చట్టంలో అలాంటి నిబంధనే పెట్టినా… గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకొచ్చిందనే అభిప్రాయం ప్రభుత్వ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అంటే అప్పడు గవర్నర్ తెలంగాణాకు అనుకూలంగా వ్యవహరించి .. ఇప్పుడు షాకివ్వడానికి కారణం రాజకీయ అంశాలేనని భావిస్తున్నారు. ఆయనపై బిజేపి ఒత్తిడి పనిచేసిందని అంటున్నారు. బిజేపీ నేతలు కూడా తాము గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ఆగిపోయిందని ప్రచారం చేసుకుంటున్నారు.
మున్సిపల్ బిల్లు 2019ను అసెంబ్లీ,శాసనమండలి శుక్రవారం నాడు ఆమోదించి గవర్నర్ కు పంపాయి. ఆమోదమే తరువాయని చెప్పి అసెంబ్లీని ప్రోరోగ్ చేశారు. అయితే ఈ బిల్లుకు అనూహ్యంగా గవర్నర్ నరసింహన్ బ్రేకులు వేసారు. గవర్నర్ అనూహ్య నిర్ణయంతో తెలంగాణా ప్రభుత్వం బిత్తరపోయింది. బిల్లులో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారాలకు విఘాతం కలిగించేలా ఉన్న నిబంధనపై అభ్యంతరం వ్యక్తం చేసారని తెలిసింది..శాసనసభ ఆమోదించిన బిల్లులో ఎన్నికల తేదీలను,సూచించే అధికారం ప్రభుత్వానికి కల్పించారు. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారని సమాచారం.అంతేకాదు బిల్లును తిప్పి పంపకుండా కేంద్రానికి పంపి వివరణ తీసుకున్నాకే ఆమోదిస్తానని చెప్పారట. కేంద్రంతో వ్యవహారం అంటే ఇప్పట్లో తేలే విషయం కాదని ఆగమేఘాలపై చట్టం స్థానంలో ఆర్డినెన్స్ జారీ చేసారు.
గవర్నర్ వ్యవహారశైలి తెలంగాణ ప్రభుత్వానికి వార్నింగ్ లాంటిదేనని.. రాజకీయవర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ ఇంత వరకూ తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. గతంలో.. ఇంటర్ బోర్డు వ్యవహారంతో పాటు.. పోడు భూములు.. ఇతర అంశాల్లోనూ గవర్నర్ కలుగచేసుకుని సమీక్షలు నిర్వహించారు. ఇప్పుడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకే కొర్రీలు పెట్టారు. ఇవన్నీ టీఆర్ఎస్ను కాస్త ఆందోళనకు గురి చేస్తున్న వ్యవహారాలుగా కనిపిస్తున్నాయి. ఇకపై గవర్నర్ కీలక పాత్ర పోషించబోతున్నారని తెలంగాణా ప్రభుత్వం కోరినట్టుగా సాగదని తేలిపోతోంది.