40 రూపాయలు అంటే ఎంత చిన్న మొత్తం. ఆ మొత్తానికి, శుభ్రంగా తింటే రోడ్డు పక్కన ఉండే బండి మీద టిఫిను కూడా రాదు. అలాంటిది నెలరోజులకు 40 రూపాయలు అంటే దాన్ని గురించి ఇవాళ పసిపిల్లలు కూడా పట్టించుకోరు. నెలకు 40 రూపాయల పాకెట్ మనీ అంటే ఒకటోక్లాసు పిల్లలు కూడా నవ్వుతారు. కానీ ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మాత్రం అలాంటి బాపతు వ్యక్తి కాదు. తనకు రావాల్సినదానిని వదులుకోవడం ఆయనకు ఇష్టంలేదు. అందుకే నెలరూ 40 రూపాయల వంతున ఆరునెలల్లో 240 రూపాయలు చాలా దారుణంగా నష్టపోయాను సార్.. అంటూ ఉన్నతాధికార్లకు పదేపదే విన్నవించుకుని.. ప్లీజ్ సార్ కన్సిడర్ చేయండి అంటూ వారిని వేడుకుని.. ఆ సొమ్ము కాస్తా సాధించుకున్నారు. అప్పటికి గానీ ఆయన సంతృప్తి చెందలేదు.
ఏంట్రా బాబూ.. గవర్నర్ నరసింహన్ ఏమిటీ.. నెలకు రూ.40 రూపాయల కోసం ఇంతగా ఆరాటపడిపోవడం ఏమిటీ అంటూ విస్తుపోతున్నారా? ఇది ఇప్పటి సంగతి కాదు లెండి! వివరాల్లోకి వెళితే.. నరసింహన్ ఐపీఎస్ అధికారిగా ఏపీలో పనిచేస్తున్న రోజుల్లో ఇతర రాష్ట్రా అధికారులు ఇక్కడి స్థానిక భాష నేర్చుకుంటే వారికి నెలకు రూ.40 ఇంక్రిమెంటు వచ్చేది. ఆ ఇంక్రిమెంటు కోసం అధికార్లు ఆయనకు టెస్టు పెడితే.. చదవడం రాయడంలో ఫెయిలయ్యారు. మాట్లాడగలిగారు. దాంతో ఇంక్రిమెంటు కోసేశారు. ఆర్నెల్ల తర్వాత మళ్లీ టెస్టు జరిగింది. ఈ ఆర్నెల్లలో ఆయన చదవడం, రాయడం నేర్చుకోలేదు గానీ.. మాట్లాడగలుగుతున్నాను కదా సార్.. ఇక్కడి ప్రజల చెప్పేది అర్థం చేసుకుంటున్నా కదా సార్.. మీరు నా ఇంక్రిమెంట్ కోసేస్తే ఆర్నెల్లలో 240 రూపాయలు కోల్పోయాను సార్. ప్లీజ్ నా ఇంక్రిమెంట్ నాకు ఇచ్చేయండి సార్ అంటూ విన్నవించుకుని ఓకే చేయించుకున్నారట. అదీ సంగతి.
ఈ వైఖరి మొత్తం గమనిస్తే.. ‘నాది కానిది నాకు ఒక్క పైసా కూడా అక్కర్లేదు. కానీ నాకు దక్కవలసినది ఒక్క పైసా కూడా వదులుకోను’ అంటూ సాహసం సినిమాలో హీరో గోపీచంద్ చెప్పే డైలాగు గుర్తుకొస్తోందా? మన గవర్నర్ జీ కూడా అదే టైపు అనుకోవాలన్నమాట!!