ఏపీ గవర్నర్గా నరసింహన్ పదవీ కాలం ముగిసింది. కొత్త గవర్నర్ నియమితులయ్యారు. అందుకే.. నరసింహన్కు.. ఏపీ సర్కార్ ఆత్మీయ వీడ్కోలు పలికింది. విజయవాడలోని ఓ హోటల్లో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో.. అటు గవర్నర్.. ఇటు జగన్ ఒకరిని ఒకరు… పద్యాలు, పాటల రూపంలో ప్రస్తుతించుకున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. గవర్నర్ నరసింహన్ … ఓ సందర్భంలో.. తన పరిధిని దాటి మరీ.. జగన్మోహన్ రెడ్డికి కొన్ని అంశాల్లో గట్టిగా.. సూచనలు, సలహాలు చేయాల్సి వచ్చిందని.. చెబుతూ.. ఓ సారీ కూడా ఇచ్చేశారు. ఇది అక్కడ కూర్చున్న చాలా మందిని ఆశ్చర్యపరిచింది. జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయి.. యాభై రోజులు మాత్రమే అయింది. ఈ కొన్ని రోజుల్లో.. జగన్మోహన్ రెడ్డికి.. గవర్నర్ ఇచ్చిన అంత గట్టి సలహాలేమిటన్నదే ఆ ఆశ్చర్యం.
ప్రభుత్వ నిర్ణయాలపై సలహాలిచ్చారా..?
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు పాలనా పరంగా..ఇటు రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాలు కొన్ని కేంద్రాన్ని , బీజేపీని ఆగ్రహానికి గురి చేశాయన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ముఖ్యంగా పీపీఏల వంటి అంశాల్లో… అతి జోక్యం వద్దని.. కేంద్రం రెండు సార్లు హెచ్చరిక లేఖలు పంపింది. సాధారణంగా ఇది అసాధారణం. జగన్ తీసుకున్న నిర్ణయం.. దేశ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాల మీద దెబ్బకొట్టే ప్రమాదం ఉండటంతో… గట్టిగానే చెప్పారు. అయినా వినకపోతూండటంతో.. గవర్నర్ ద్వారా కూడా.. హెచ్చరికలతో కూడిన.. సూచనలు పంపినట్లు… నరసింహన్ తాజా వ్యాఖ్యలతో నిరూపితమయిందని అంటున్నారు. అది మాత్రమే కాదు.. పాలనా పరంగా.. మరికొన్ని అంశాల్లో జగన్ కు.. రాజ్ భవన్ నుంచి దిశానిర్దేశం అందిందని అంటున్నారు.
రాజకీయాలు ఎలా చేయాలో కూడా చెప్పారా..?
అదే సమయంలో.. రాజకీయంగా కూడా.. జగన్ తీసుకున్న నిర్ణయాలు బీజేపీకి అడ్డంగా మారుతున్నాయి. పదే పదే ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించడం దగ్గర్నుంచి… టీడీపీ నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పార్టీ ఫిరాయిస్తే.. అనర్హతా వేటు వేస్తామని హెచ్చరించడం వరకు.. చాలా అంశాలు బీజేపీ పెద్దలకు నచ్చడం లేదు. ఎలాగోలా బీజేపీలోకి చేరేలా ఒప్పిస్తే.. పదవి పోతుందని.. వైసీపీ తరపు నుంచి హెచ్చరికలు రావడంతో… వాళ్లు ఆగిపోయారన్న ఆగ్రహం బీజేపీలో ఉందంటున్నారు. దీనిపై చూసీ చూడనట్లు పోవాలని జగన్ కు గవర్నర్ సూచించారంటున్నారు. అలాగే హోదా అంశాన్ని లేవనెత్తవద్దని కూడా చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. చెప్పే పద్దతిలో కాకుండా.. కాస్త గట్టిగానే.. నరసింహన్ చెప్పారని.. అందుకే… క్షమాపణలు చెప్పారని అంటున్నారు.
క్షమాపణలు చెప్పాల్సింత “గట్టి”గా ఎందుకు చెప్పాల్సి వచ్చింది..?
గవర్నర్ అంటే.. కేంద్ర ప్రభుత్వ దూత. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలి. రాజకీయాలు చేయాలి. ఆ విషయంలో గవర్నర్ నరసింహన్ పండిపోయారు కాబట్టే… కాంగ్రెస్ హయాంలో నియమితులైనప్పటికీ.. బీజేపీ హయాంలోనూ గవర్నర్ గా కొనసాగారు. ఇప్పుడు.. కూడా ఆయనకు ఓ రాష్ట్రం తగ్గించారు కానీ… పూర్తి గా తొలగించలేదు. పన్నెండేళ్లు గవర్నర్ గా ఉన్నారు. ఇంకా నాటౌట్.. అంటేనే.. ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ఎంత సంతృప్తి పరుస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ కోణంలో.. ఆయన రాజకీయ వ్యూహాలను తెలుగు రాష్ట్రాల్లో బాగానే చక్కబెట్టేవారు. అందుకోసం అతిగా అడ్వాంటేజ్ తీసుకున్నట్లు వీడ్కోలు సభలో చెప్పకనే చెప్పారు.