హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్‌కు త్వరలో స్థాన చలనం ఉంటుందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. వాస్తవానికి ఆయన పదవీకాలం మరో ఏడాదిన్నర ఉన్నప్పటికీ కేంద్రం ఆయనను సాగనంపాలని యోచిస్తోందని ఒక జాతీయ ఆంగ్ల దినపత్రిక కథనం. మాజీ ఐఏఎస్ అధికారి అయిన నరసింహన్, యూపీఏ ప్రభుత్వం హయాంలో నియమితులైనప్పటికీ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతకూడా కొనసాగుతున్నారు.
2007లో నేషనల్ సెక్యూరిటీ ఎడ్వైజర్ ఎమ్కే నారాయణన్ సిఫార్సుపై నరసింహన్ ఛత్తీస్గడ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2009లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న నారాయణ్‌దత్ తివారిపై తీవ్ర ఆరోపణలు రావటంతో ఆయన వైదొలగాల్సి వచ్చింది. దీంతో నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలుకూడా అప్పగించారు. నరసింహన్ పదవీకాలం 2012లోనే ముగిసినప్పటికీ, అప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్రరూపంలో ఉండటంతో యూపీఏ ప్రభుత్వం ఆయనను కొనసాగించింది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆయనను కొనసాగించటానికి కారణం – రెండు తెలుగు రాష్ట్రాలమధ్య సున్నితమైన సమస్యలు ఉండటంతో ఈ విషయాలపైన అవగాహన ఉన్న నరసింహనే మేలని భావించటం. అయితే ఇటీవల నరసింహన్ తెలంగాణ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశంపార్టీ మండిపడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సమయంలో తెలంగాణ వ్యతిరేకి అంటూ తెలంగాణ వాదులు విమర్శలు ఎదుర్కొన్న నరసింహన్ విభజన తర్వాత ఇలా సీమాంధ్రవాసుల వ్యతిరేకత ఎదుర్కోవటం విశేషం. మరోవైపు గవర్నర్ పదవులకు కొత్త నియామకాలు జరపాలని సంఘ్ పరివార్నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలైన విద్యాసాగరరావును మహారాష్ట్ర గవర్నర్‌గా, వఝూభాయ్ వలాను కర్ణాటకలో, తథాగతరాయ్‌ను త్రిపురలో , పశ్చిమ బెంగాల్లో కేసరి నాథ్ త్రిపాఠిని, రామ్ నాథ్ కోవింద్‌ను బీహార్‌లో, కళ్యాణ్‌సింగ్‌ను రాజస్థాన్‌లో నియమించారు. అయితే గవర్నర్ పదవులు ఆశిస్తున్నవారు ఇంకా పలువురు ఉండటంతో నరసింహన్ స్థానంలోకూడా సంఘ్ పరివార్‌కు చెందిన ఎవరో ఒకరిని త్వరలో నియమించనున్నారని ఒక వాదన వినబడుతోంది.
మరోవైపు ప్రస్తుత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మాజీ ఐఏఎస్ అధికారి అయిన నరసింహన్‌కు బేచ్ మేట్, మంచి స్నేహితుడు కాబట్టి ఆయనకు స్థానచలనం ఉండకపోవచ్చని మరో వాదన వినబడుతోంది. ఏది ఏమైనా బీహార్ ఎన్నికలు జరిగే అక్టోబర్-నవంబర్ వరకు మాత్రం నరసింహన్‌ను తప్పించరని చెబుతున్నారు. ఏ క్షణానైనా తప్పుకోవటానికి నరసింహన్‌కూడా మానసికంగా సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.