ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పోరేట్ కాలేజీలలో విద్యార్ధుల ఆత్మహత్యలు నానాటికి పెరుగుతున్నాయే తప్ప ఆగడం లేదు. కర్నూలు జిల్లాలో నన్నూరు గ్రామ వద్ద గల నారాయణ జూనియర్ కాలేజీకి చెందిన శ్రీకాంత్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకొన్నాడు. అతను ఇంటర్ మొదటి సం.విద్యార్ధి. అతనిది అదే జిల్లాలో ఉల్లిందకుంట గ్రామం. అతని మరణానికి కారణాలు ఏమిటో ఇంకా తెలియవలసి ఉంది. కానీ అతను కాలేజీ హాస్టల్లో తన రూములోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడని విద్యార్ధులు వాదిస్తుంటే కాలేజీ యాజమాన్యం మాత్రం అతను కాలేజీ బయట ఆత్మహత్య చేసుకొన్నాడని వాదిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతని శవాన్ని పోస్ట్ మార్టెం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని ఆత్మహత్యకి గల కారణాలు ఏమిటో ఇంకా తెలియలేదు. పోలీసులు అతని వస్తువులను, పుస్తకాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.
గత రెండు మూడు నెలలుగా కాలేజీలలో వరుసపెట్టి విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతామని ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇస్తున్నారు. కానీ విద్యార్ధుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. కాలేజీలలో ర్యాగింగ్, ర్యాంకుల సాధన కోసం విద్యార్ధులపై నిరంతర ఒత్తిడి ఇంకా అనేక ఇతరత్రా కారణాలతో విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ సమస్యని సీరియస్ గా తీసుకొన్నట్లు కనబడటం లేదు. మంత్రులు గంటా శ్రీనివాస రావు, నారాయణ ఇద్దరు బంధువులు కావడం చేతనే, దోషులను కటినంగా శిక్షించకుండా ఉపేక్షిస్తూ, కేసులను నొక్కిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.