తెలుగు రాష్ట్రాల్లో కళాశాల విద్యార్ధుల ఆత్మహత్యల పరంపర… అలజడి. కార్పోరేట్ కళాశాలలు విద్యార్ధుల పాలిట బందీఖానాలుగా, ఆత్మహత్యా ప్రేరకాలుగా మారాయంటూ చర్చలు, హడావిడి… ప్రభుత్వాధినేతల సమావేశాలు, కళాశాలలకు వార్నింగులూ షురూ…. విద్యార్థి సంఘాల ఆందోళనలూ… ఈ నేపధ్యంలో…గత రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కార్పోరేట్ కళాశాల విద్యార్ధుల పరిస్థితిపై పెను దుమారం రేగుతోంది. దీనికి ప్రధాన కారణం మీడియా.
విద్యార్ధుల్ని రాచి రంపాన పెట్టి మరీ ర్యాంకుల్ని పిండే కార్పోరేట్ కళాశాలల విద్యావిధానం గురించి ఇప్పుడు లేటెస్ట్గా చెప్పుకోవల్సిందేమీ లేదు. ఇక సదరు కళాశాల విద్యార్ధులు చదువు బరువు మోయలేక బలవన్మరణాలకు పాల్పడడమూ ఇప్పుడే జరుగుతున్నదీ కాదు. మరి ఇప్పుడే ఎందుకీ రచ్చ? ఎందుకింత ఆందోళన? అవాంఛనీయమైన రీతిలో రోజుల వ్యవధిలో పలువురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం మాత్రమే దీనికి కారణమా?
ఈ ప్రశ్నకు అవును అంటే అది కేవలం అర్ధసత్యం మాత్రమే. నిజానికి ఎప్పటినుంచో కార్పోరేట్ కాలేజీల వ్యవహార శైలి, విద్యార్ధుల్ని వేధిస్తున్న తీరు గురించి పలు విద్యార్ధి సంఘాలు అభ్యంతరాలు లేవనెత్తుతూనే ఉన్నాయి. ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. అయితే అప్పుడెప్పుడూ పెద్దగా పట్టించుకోకుండా ఇప్పుడే ఇంత హడావిడి జరగడం వెనుక అంత బ్రహ్మరహస్యం ఏమీ లేదు. నారాయణ కళాశాలల గ్రూప్ యజమాని ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం, పైగా మంత్రి కావడం, ఆయన ఎపి విద్యాశాఖమంత్రి గంటాతో వియ్యంకుడు కావడం…
రాజకీయవైరాన్ని ప్రదర్శించడానికి ఓ వర్గం మీడియా నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీంతో సహజంగానే మిగతా మీడియా కూడా కాస్తో కూస్తో ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు. ఇది నారాయణ మంత్రి అయిన దగ్గర్నుంచి సునిశితంగా పరిశీలిస్తే చిన్న పిల్లాడికైనా అర్ధమైపోతుంది. సదరు మీడియాకి ప్రస్తుత విద్యార్ధుల ఆత్మహత్యలు మరింత అవకాశంగా మారాయి.
నిజానికి నారాయణ, చైతన్య వంటి కాలేజీలు ఇంతింతై వటుడింతై అన్నట్టు విస్తరించడంలో మీడియా పాపం కూడా తక్కువేం లేదు. సదరు కళాశాలలు పోటాపోటీగా ర్యాంకుల వేట సాగిస్తే తగుదునమ్మా అంటూ వంత పాడింది మీడియానే. రూ.కోట్ల ఖర్చుతో అవి కుమ్మరించే ప్రకటనల ఆదాయానికి మైమరచిపోయి పేపర్ల, టీవీల నిండా తెగ చూపించి విద్యార్ధుల తల్లిదండ్రుల్లో భ్రమలు రాజేసింది మీడియానే. అంతెందుకు… గతంలో ఇదే విధంగా ఏదైనా కార్పోరేట్ కాలేజ్లో ఆత్మహత్య సంఘటన జరిగితే… ప్రకటనలకు గండిపడుతుందేమో అనే భయంతో ఆ కాలేజీ పేరు కూడా ప్రచురించకుండా కేవలం ఓ కాలేజ్లో అంటూ మాత్రమే చెప్పి సదరు కాలేజ్ పేరు దాచిపెట్టిన ఉదంతాలూ ఉన్నాయి. మరోవైపు ఈ కాలేజీలు ప్రకటించుకునే ర్యాంకులు సైతం బోంకులేనని ప్రధాన మీడియాను చాచి పెట్టి కోట్టినట్టు సోషల్ మీడియా పలు మార్లు తేల్చి చెప్పింది.
కార్పోరేట్ కాలేజీల్లో విద్యావిధానాన్ని తప్పకుండా సమీక్షించాల్సిందే. విద్యార్థుల్ని రాచి రంపాన పెట్టే పద్ధతుల్ని నియంత్రించాల్సిందే. అయితే అది ఓ వ్యక్తినో, ఓ కాలేజ్నో టార్గెట్ చేసి చేయాల్సింది కాదు. మీడియా వ్యక్త పరచే ఆందోళన విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా సాగాలి. ఇప్పటికైనా కార్పోరేట్ కళాశాలల అనారోగ్యధోరణులు సమూలంగా మాయమయ్యేందుకు మీడియా నిష్పక్షపాతంగా పూనుకోవాలని ఆశిద్దాం.