తెలుగుదేశంలో ఒక కల్చర్ ఉంటుందని బయట చెప్పుకుంటార్లెండి! పార్టీగానీ, వారి హయాంలోని ప్రభుత్వంగానీ ఏదైనా విజయం సాధిస్తే… అది చంద్రబాబు నాయుడు విజన్ అంటారు. ఆయన ధీరోదాత్తత అని చెబుతారు. ఆయన చాణక్యం అని మురిసిపోతారు. అదే.. పార్టీగానీ, ఆ పార్టీ నిర్వహిస్తున్న ప్రభుత్వంగానీ ఎక్కడైనా విఫలం చెందితే… అక్కడ అధినేత పేరు వినిపించదు! చంద్రబాబు ప్రస్థావనే రాదు. ఓటమికి గల కారణాలన్నీ వేర్వేరుగా వినిపిస్తున్నాయి. స్థానిక నాయకులు సరిగా పనిచెయ్యలేదనో, అధినేత చెప్పినట్టు కేడర్ నడుచుకోలేదనో, చంద్రబాబు విజన్ అర్థం చేసుకోలేకపోయారనో… ఇలాంటి సౌండింగ్ వినిపిస్తూ ఉంటుంది! పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీల్లో టీడీపీ ఓడిపోయింది కదా. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా టీడీపీకి ఎమ్మెల్సీ దక్కకుండా పోయింది. దీంతో పార్టీలో రకరకాల చర్చ జరుగుతున్నాయట! విశ్లేషణలు ప్రారంభమైపోయాయి.
ఇంతకీ ఈ ఓటమికి బాధ్యత వహించాల్సింది ఎవరయ్యా అంటే.. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామాత్యులు నారాయణ! అవును, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పరువు పోవడానికి కారణం ఆయనే అంటూ తమ్ముళ్లు నారాయణ వైపే వేలు చూపిస్తున్నారట..! ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారనీ, ఆయనకు నచ్చిన వ్యూహాలను అమలు చేశారనీ, స్థానిక నేతలను పట్టించుకోలేదనీ, స్థానికంగా వ్యతిరేకత ఉన్నవారికి కూడా మద్దతు ఇచ్చారనీ, తన అనుచరుడైన పట్టాభిరెడ్డికి పట్టుబట్టి మరీ టిక్కెట్ ఇప్పించారనీ, ఇతర నేతలతో సఖ్యతలేని పట్టాభి విషయంలో ఆయన పంతాలకు పోయారనీ.. ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు! ఇవే ఇప్పుడు వినిపిస్తున్నాయి.
నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల ఎమ్మెల్సీల ఓటమి భారమంతా నారాయణ నెత్తినే పడబోతోందన్నది స్పష్టం. పార్టీ రివ్యూ మీటింగ్ లో ఇదే హాట్ టాపిక్ అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఓటమి భారమంతా నారాయణపైనే తోసేస్తున్నారు. పార్టీ అధినేతకు ఈ ఓటమి భాగం ఉండదా..? ఇతర నాయకులు ఎవ్వరూ వ్యూహంలో భాగస్వాములు కాలేదా..? పార్టీలో స్వతంత్రంగా వ్యవహరించేంత స్వేచ్ఛ నారాయణకు ఉన్నప్పటికీ, చంద్రబాబు అదుపాజ్ఞల్లోనే ఆయన కూడా పనిచేస్తారు కదా! అదే, కడప ఎమ్మెల్సీలో టీడీపీ గెలిచేసరికి చంద్రబాబు తెరమీదికి వచ్చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జోస్యం చెప్పారు. పులివెందులలో కూడా గెలిచి తీరతాం అంటూ ధీమా వ్యక్తం చేశారు.
కానీ, ఇప్పుడు ఆయన మాట్లాడరు. ఓటమికి కారణాలేంటో ప్రజలకు చెప్పరు. కార్యకర్తలకూ వివరించరు. ఇప్పుడు మంత్రి నారాయణే మాట్లాడాలి..! వైఫల్యానికి ఆయనే వివరణ ఇచ్చుకోవాలి. అలాగని, ఈ ఓటమిలో నారాయణ స్వయంకృతాన్ని తక్కువ చేసి చెప్పాలన్న ఉద్దేశం లేదు సుమా! ఈ క్రమంలో చంద్రబాబు తీరు గురించి మాట్లాడుకుంటున్నాం.. అంతే! సో… ఫైనల్ గా చెప్పొచ్చేది ఏటంటే.. చంద్రబాబు విజయ రహస్యం ఇదన్నమాట!