చంద్రబాబును ఏ వన్‌గా నారాయణ ఏ – 2గా చేర్చి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేసించింది. మాజీ మంత్రి నారాయణ సహా పలు సంస్థలకు ఊరట లభించింది. ఈ విషయమై ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణతో పాటు లింగమనేని సంస్థలు, రామకృష్ణ రియల్ ఏస్టేట్ సంస్థలు ముందస్తు బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకొన్నాయి. ఈ విషఁయమై విచారణ నిర్వహించిన హైకోర్టు జూన్ 9వ తేదీ వరకు వీరిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే చంద్రబాబు మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు.
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చేసి అక్రమాలకు పాల్పడ్డారని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు మేలు చేశారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి సాక్ష్యాలున్నందున కేసు నమోదు చేశామనిసీఐడీ ప్రకటించింది. హైదరాబాద్‌లో నారాయణను అరెస్ట్ చేసిన రోజున ఎందుకు అరెస్ట్ చేశారో ముందు చెప్పలేదు . అయితే మొదట ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు బయటకు వచ్చింది. దీంతో ఆ కేసులో అరెస్ట్ చేశారేమో అనుకున్నారు. కానీ చివరికి వ్యూహం మార్చి పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ చేశారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆయనకు అప్పుడే బెయిల్ లభించింది.
అసలు ఇన్నర్ రింగ్ రోడే నిర్మాణం కాలేదు. కనీసం అంగుళం కూడా భూమిని సేకరించలేదు. ఇక్కడ ఎవరికీ లబ్ది అనే ప్రశ్నే రాదు. పైగా అలైన్ మెంట్ ఖరారు కోసం అన్ని రకాల నిబంధనలు పాటించారు. అయినప్పటికీ ఏదోకేసు పెట్టాలి కాబట్టి పెట్టినట్లుగా ఉండటంతో … సీఐడీ తీరుపై మొదట్లోనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత సీఐడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే పోలీసులు ఏ అర్థరాత్రో వచ్చి అరెస్ట్ చేసే ప్రమాదం ఉన్నందున.. అందులో ఉన్న వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు.