సొంత సినిమాలు తప్ప, బయట నిర్మాణ సంస్థల్లో పనిచేయడు ఆర్.నారాయణమూర్తి. తన సినిమాల్ని తానే తీసుకోవడం, తానే దర్శకత్వం వహించడం, అన్ని పనుల్నీ తానే స్వయంగా చూసుకోవడం మూర్తికి అలవాటు. అందుకే పూరి జగన్నాథ్ అంతటి వాడు పిలిచి ఆఫర్ ఇస్తానంటే ‘సారీ.. బ్రదర్’ అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడు. అలాంటిది చాలా కాలం తరవాత బయటి సంస్థలో ‘హెడ్ కానిస్టేబుల్ వెంటట్రామయ్య’ సినిమమాలో నటించాడు నారాయణమూర్తి. ఈ సినిమాకి చదలవాడ దర్శకుడు. ఆయనే నిర్మాత. ఈ చిత్రానికిగానూ నారాయణమూర్తికి అక్షరాలా రూ.1.5 కోట్ల పారితోషికం అందిందని సమాచారం. కోటిన్నర అంటే… రాజ్ తరుణ్, శర్వానంద్ రేంజు. నారాయణ మూర్తి సినిమాలన్నీ కోటి రూపాయల్లోపు ముగుస్తాయి. అలాంటిది పారితోషికంగా అంతకంటే ఎక్కువ మొత్తం అందుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. అయితే నారాయణమూర్తి ”నాకు ఇంత పారితోషికం కావాలి” అని అడగలేదట. అడక్కుండానే చదలవాడ కోటిన్నర చేతిలో పెట్టేశారని తెలుస్తోంది.
ఈ స్థాయిలో పారితోషికం చూడడం మూర్తిగారికి ఇదే తొలిసారి. కాబట్టి… భవిష్యత్తులో ఇలాంటి ఆఫర్లు వస్తే.. `నో` చెప్పడేమో అనిపిస్తోంది. అయితే… కానిస్టేబుల్ సినిమాకొచ్చిన వసూళ్లు చూస్తే మాత్రం షాక్ తినక తప్పదు. ఈనెల 14న విడుదలైన ఈ సినిమాకి అన్నీ కలుపుకొని కోటి రూపాయల రాబడి కూడా రాలేదట. అంటే.. మూర్తి గారి పారితోషికం కూడా సంపాదించుకోలేకపోయిందీ సినిమా. ‘బిచ్చగాడు’ లాభాల్ని ఈ సినిమా తన్నుకుపోయిందని కొందరంటుంటే, కేవలం నష్టాల్ని చూపించుకోవడానికే నారాయణమూర్తితో ఈ సినిమా తీసుంటారని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇలాక్కూడా సినిమాలు తీస్తారా…?? ఏమో మరి.