తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో రెండు ప్రముఖ చానళ్ల మధ్య డైరక్ట్ వార్ ప్రారంభమయింది. తమ ఆయుధాలు చానళ్లే కాబట్టి.. ఆ చానళ్ల వేదికగా ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓ మోటు సామెత ఉంటుంది. . ఊరి బయట ఎవరో కోట్లాడుకుంటే.. ఊళ్లో పెద్ద మనుషుల జాతకాలు బయటపడ్డాయని.. ఇక్కడ ఊళ్లో పెద్ద మనుషులే కోట్లాటకు దిగారు కాబట్టి.. వారి జాతకాలు మొత్తం వాళ్లే బయట పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ మీడియా పెద్ద మనుషులు ఎవరో కాదు.. టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడు… ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి.
ఇప్పటి వరకూ ఈ రెండు చానళ్ల మధ్య అవాంఛనీయమైన పోటీ ఉందని ఎప్పుడూ బయటకు రాలేదు. వాటి యజమానుల మధ్య గొడవలు ఉన్నాయని కూడా బయటకు చెప్పుకోలేదు. కానీ హఠాత్తుగా.. ఇద్దరి చానళ్లలో ఒకరిపై ఒకరు ప్రోమోలు వేసుకోవడం ప్రారంభించారు. ఒకరు జూబ్లిహిల్స్ సొసైటీ గురించి చెబితే.. మరొకలు… అరచేతిలో వెంట్రుకలు మెలిపించే ఆయిల్ గురించి చెప్పడం ప్రారంభించారు. ఇవి మచ్చుకు మాత్రమే.. ఒకరి పై ఒకరు లెక్కలేనన్ని ఆరోపణలు చేసుకుంటున్నారు. కథనాలు ఎప్పుడొస్తాయో క్లారిటీ లేదు కానీ.. ప్రోమోలు మాత్రం… పడిపోతున్నాయి.
అయితే.. రెండు చానళ్లలోనూ… ఒకరి నొకరు బ్లాక్మెయిలింగ్ కోసం అన్నట్లుగా.. ఎవరి పేరునూ ప్రస్తావించడం లేదు. నువ్ సైలెంట్ అయితే.. నేను సైలెంట్ అవుతా అన్నట్లుగా ఇద్దరి మధ్య ఒప్పందం వస్తే ప్రోమోలు కథనాలు ఆగిపోతాయేమో తెలియదు కానీ.. ఇప్పటికి ఇద్దరు సై అంటున్నారు. బీఆర్ నాయుడు, ఎన్టీవీ చౌదరి మధ్య టీవీ చానళ్లలో ముష్టియుద్ధానికి పాల్పడేందుకు వైరం ఎక్కడ వచ్చిందో అన్నదానిపై మీడియా వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఎన్టీవీ ప్రో జగన్. టీవీ5 పూర్తి స్థాయిలో జగన్ను వ్యతిరేకిస్తోంది. టీవీ5ని కంట్రోల్ చేయడానికి వైసీపీ వైపు నుంచి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతోనే తెలుస్తోంది. ఇప్పుడు.. ఏపీ అధికార పార్టీ ఒత్తిడితోనే ఎన్టీవీ సాటి మీడియాపై దాడికి దిగుతోందా.. అన్న సందేహం కొంత మందిలో ప్రారంభమయింది. అయితే.. అలాంటిదేమీ ఉండదని.. ఇద్దరి మధ్య వ్యాపార వివాదాలు.. ఇతర వ్యక్తిగత శత్రుత్వం వల్లే.. ఇలాంటివి జరుగుతున్నాయని అంటున్నారు. ఇద్దరూ మీడియాలో ప్రముఖులు కాబట్టి.. తమ బాగోతాల్ని ప్రజల ముందు పెట్టుకుంటారా లేదా పరువు కాపాడుకుందామని ఒప్పందం చేసుకుంటారో చూడాలి..!