తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన మంత్రి దృష్టిలో పడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆయన చేసిన పోరాటం.. ప్రధానమంత్రి మోడీని మెప్పించింది. పార్టీ నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే మోడీ.. అద్భుతంగా పని చేశారన్న వారికి పర్సనల్‌గా ఫోన్ చేసి అభినందిస్తూ ఉంటారు. అలా అభినందించిన వారికి భవిష్యత్‌లో కూడా గుర్తింపు ఉంటుంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరపున బండి సంజయ్ అద్భుతంగా పోరాడారన్న నివేదికలు అందడంతో మోడీ..నేరుగా బండి సంజయ్‌తో మాట్లాడారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని మోడీ అభినందించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపుగా పది నిమిషాల పాటు మోడీ .. బండి సంజయ్‌తో మాట్లాడారు.
నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులపై వివరాలు అడిగి తెలుసుకున్ని.. . నూతన ఉత్సాహంతో ఉన్న పార్టీ క్యాడర్ పట్ల హర్షం వ్యక్తం చేశారని బీజేపీ వర్గాలు చెప్పాయి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని బండి సంజయ్‌ను మోడీ భుజం తట్టినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్లో బండి సంజయ్ మొదటి నుంచి దూకుడైన ప్రచారం నిర్వహించారు. వివాదాస్పద ప్రకటనతో తానే హైలెట్ అయ్యారు. ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే అని ఎలివేట్ అయింది. పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే సాగిందనన్న అభిప్రాయం వ్యక్తమయింది. హైదరాబాద్‌లో ఎలాంటి దూకుడుతో ఉండాలో… అలాంటి దూకుడుతో ఉన్నారన్న అభిప్రాయం హైకమాండ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో బీజేపీలో ఇప్పుడు ప్రముఖ నేతగా బండి సంజయ్ మారారు. మోడీనే బండి సంజయ్ ను గుర్తించారంటే.. తర్వాత మరింత ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నారు. మోడీ – షా ఇటీవలి కాలంలో భవిష్యత్ బీజేపీ నేతల్ని గుర్తించి ప్రోత్సహిస్తున్నారని.. తేజస్వి సూర్యను అలాగే ప్రోత్సహిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. బండి సంజయ్ కు కూడా .. హైకమాండ్ వద్ద పలుకుబడి పెరిగిందని అంటున్నారు.