జగన్మోహన్ రెడ్డి విధానాలకు.. దేశంలో ఎక్కడా మద్దతు దొరకడం లేదు. పీపీఏలు, పోలవరం వంటి అంశాల్లోనే కాదు.. చివరికి మాతృభాషను.. కాదని.. ఓన్లీ ఇంగ్లిష్ మీడియం అంటున్న జగన్ విధానానికి.. కూడా కేంద్ర పెద్దల నుంచి మద్దతు దక్కడం లేదు. మన్ కీ బాత్‌లో.. మాతృభాష గురించి ప్రత్యేకంగా మాట్లాడిన నరేంద్రమోడీ.. కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే.. ఎంత అభివృద్ధి సాధించినా వృథానేని స్పష్టం చేశారు. ఓ వ్యక్తి సమగ్ర పురోగతికి అతడి భాషా పురోగతే మూలం అని.. ఆధునిక హిందీ భాష పితగా పేరొందిన భారతేందు హరిశ్చంద్ర 150 ఏళ్ల క్రితం చెప్పారని మోడీ గుర్తు చేశారు.
మాతృభాషలో పరిజ్ఞానం లేకుండా పురోగతి సాధ్యం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లోని ధార్చులా అనే గ్రామంలో ప్రజలు తమ భాషను కాపాడుకుంటున్నారంటూ ప్రధాని వారిపై ప్రశంసలు గుప్పించారు. మన నాగరికత, సంస్కృతి, భాషలు.. ప్రపంచానికి భిన్నత్వంలో ఏకత్వాన్ని బోధిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా భాషలు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ విషయమై అవగామన కల్పించడం కోసం ఐక్యరాజ్య సమితి 2019ను అంతర్జాతీయ స్వదేశీ భాషల సంవత్సరంగా గుర్తించింది.
ఏపీ సర్కార్.. తెలుగు మీడియంను రద్దు చేయాలని నిర్ణయించడం.. అదే సమయంలో.. మోడీ మాతృభాషపై కీలకమైన వ్యాఖ్యలు రచేయడం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగు మీడియం ఉండాలన్న వారిని ఇంగ్లిష్ మీడియంకు వ్యతిరేకం అన్నట్లుగా ప్రచారం చేస్తూ.. రాజకీయంగా ఏపీ సర్కార్ ఎదురు దాడి చేస్తోంది కానీ.. అసలు సమస్యను గుర్తించడం లేదు. రాజకీయంగా.. తాను అనుకున్నది సాధించడానికి జగన్ తాపత్రయ పడుతున్నారు కానీ.. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. మోడీ.. మన్ కీ బాత్ తర్వాతైనా.. జగన్ మనసు మార్చుకుంటారో.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లని వాదిస్తారో.. వేచి చూడాల్సిందే..!