ప్రధాని నరేంద్ర మోడీ ఒకప్పుడు తను బస్టాండ్ లో ఛాయ్ అమ్ముకొని జీవించేవాడినని చెప్పుకొంటారు. ఆయన ఉద్దేశ్యం తన కృషి, పట్టుదలతో ఎంతో కష్టపడి ఆ స్థాయి నుంచి నేటి స్థాయి వరకు ఎదగలిగానని చెప్పడం కావచ్చు లేదా వేరే కారణాలు ఉండవచ్చు. ఆయన జీవిత పోరాటం చాలా మంది యువతకి ప్రేరణ కలిగించింది కానీ నీరజా పాండే అనే మహిళకు మాత్రం ఆ ఛాయ్ వాలా విద్యార్హతల గురించి అనుమానం కలిగించింది. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇటీవల మోడీ విద్యార్హతల గురించి ప్రశ్నించారు. సమాచార హక్కు క్రింద ఆ వివరాలను తెలుపవలసిందిగా కోరుతూ జాతీయ సమాచార కమీషనర్ కి నీరజా పాండే దరఖాస్తు చేయగా, దాని చైర్మన్ మాదభూసి శ్రీధర్ ఆదేశాల మేరకు అహ్మదాబాద్ లోని గుజరాత్ విశ్వవిద్యాలయ వైస్-చాన్సిలర్ ఎం.ఎన్. పాటిల్ ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల గురించి వివరాలు ప్రకటించారు.
నరేంద్ర మోడీ 1982-83 సం.లలో తమ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్ లో ఎం.ఎ. చేసారని, ఆయనకు మొదటి సం.లో 400కి 237 మార్కులు, రెండవ సం.లో 400కి 262 మార్కులు సాధించారని తెలిపారు. మొత్తం 800కి 499 మార్కులతో 62 శాతం సాధించిన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నరేంద్ర మోడీ అని ఆయన తెలిపారు. కనుక ఛాయ్ వాలా గురించి ఆ విషయంలో తక్కువగా అంచనా వేయడానికి లేదని స్పష్టమయింది.