ఎన్నికల వేళ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ వార్ మొదలైంది. అఖిలేష్, మాయావతిలాంటి నేతలు చాలా మందే ఉన్నప్పటికీ మోడీ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎక్కువ శాతం రాహుల్ గాంధీపైనే ఉంటుంది. కాంగ్రెస్ చేసిన పాపాలను హైలైట్ చేయడంపైనే ఉంటోంది. అలా అని చెప్పి రాహుల్ గాంధీని చాలా పెద్ద శతృవుగా మోడీ చూస్తున్నారనుకుని పొరబడేరు. రాహుల్ కామెడీ గురించి భారతీయులందరికంటే మోడీకే ఎక్కువ తెలుసు. అందుకే రాహుల్ గాంధీని తనకు ప్రత్యర్థిగా చూపించే ప్రయత్నాన్ని మోడీ ఎప్పుడూ చేస్తూ ఉంటారు. నితీష్ కుమార్, కేజ్రీవాల్‌లాంటి వాళ్ళను విమర్శించినప్పటికీ ప్రధాన పోటీదారులుగా మాత్రం సోనియా, రాహుల్‌లను ప్రొజెక్ట్ చేయడానికి మోడీవారు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సోనియాగాంధీ పరోక్ష పాలనలో నడిచిన అవినీతి అవతారాన్ని చూసిన తర్వాత గాంధీ ఫ్యామిలీ అన్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా ఎక్కువ శాతం మంది ప్రజలకు విరక్తి వచ్చేసింది. రాహుల్ గాంధీవారి కామెడీ వేషాలు ఆ పార్టీకి ఉన్న కొద్ది మంది సానుభూతిపరులకు కూడా భవిష్యత్‌పైన నమ్మకం లేకుండా చేస్తున్నాయి. అందుకే సోనియా, రాహుల్‌లను తనకు ప్రత్యర్థులుగా చూపిస్తూ పయనం సాగించినంత కాలం మోడీకి తిరుగులేేదు. 2014 ఎన్నికల్లో మోడీకి రికార్డ్ స్థాయి మెజారిటీ రావడానికి ప్రధాన కారణం అదే. ఇక మోడీ చెప్పిన అవినీతి నిర్మూలన, దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా, దేశాన్ని మార్చేస్తా, రాజకీయాలను కడిగేస్తాలాంటి పంచ్ డైలాగులకు కూడా చాలా మంది ఓటర్లు ఆవేశపడిపోయారు. ఇక మీడియాతో పాటు, కొత్తగా వచ్చిన సోషల్ మీడియాలో కూడా ఒక రకమైన ఉన్మాద స్థితిని క్రియేట్ చేయడంలో మోడీ అండ్ కో సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు మరోసారి ఎన్నికలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు మోడీకి అత్యావశ్యకం. అందుకే మరోసారి ‘అవినీతిని నిర్మూలిస్తా, తిన్నదంతా కక్కిస్తా..’ లాంటి డైలాగులను పేల్చుతున్నాడు. కాకపోతే 2014లో వచ్చిన ఊపు మాత్రం ఇప్పుడు రావడం లేదు. పైగా మోడీ భక్తులు చేస్తున్న సౌండ్ కంటే మామూలు జనాలు అడుగుతున్న ప్రశ్నలే ఎక్కువ వినిపిస్తున్నాయి. తిన్నదంతా కక్కిస్తా అని మోడీ అన్న వెంటనే ‘రెండున్నరేళ్ళలో ఏం కక్కించారు?’ అన్న ప్రశ్న మోడీకి ఎదురవుతోంది. పైగా విజయ్ మాల్యాలాంటి బిగ్ షాట్‌ని సేఫ్‌గా దేశం దాటించింది బిజెపివారే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జయలలితకు క్లీన్ చిట్ వచ్చింది. సల్మాన్ ఖాన్ నిర్దోషి అయ్యాడు. రాబర్ట్ వాద్రా నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేకపోయాడు మోడీ. అలాగే యూపీఎ హయాంలో జరిగిన స్కాంల విషయంలో మోడీ చేసింది ఏమీ లేదు. సోనియా గాంధీ అవినీతిని బయటపెడతా అని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టాడు. కానీ కుర్చీ ఎక్కిన తర్వాత మాత్రం సోనియా అవినీతి విషయంలో ఒక్క చర్య కూడా తీసుకోలేకపోయాడు. విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించింది లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కేసుల విషయంలో కూడా ఒక్క అడుగుకూడా ముందుకు పడడంలేదు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న బడాబడా అవినీతి నాయకుల నుంచి ఒక్క రూపాయిని కూడా కక్కించలేకపోయాడు మోడీ. నోట్ల రద్దు నిర్ణయంతో కూడా సామాన్యప్రజలను నానా రకాల ఇబ్బందులూ పెట్టాడు. కొంతమంది మరణానికి కూడా కారణమయ్యారు. కానీ అవినీతి సొమ్ము ఎంత బయటపడింది అంటే మాత్రం మోడీ దగ్గర సమాధానం లేదు. రెండున్నరేళ్ళ కాలంలో గతంలో జరిగిన అవినీతిని వెలికితీయడం కోసం కానీ, ప్రస్తుతంలో….అలాగే భవిష్యత్తులో అవినీతి జరగకుండా ఉండేేలా మోడీ తీసుకున్న చర్యలు కానీ ఏమీ లేవు. ఈ విషయంలో మోడీ ఫెయిల్యూర్ని బిజెపి వాళ్ళు కూడా ఒప్పుకుని తీరాల్సిందే.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచీ మన నాయకులందరూ కూడా అవినీతి నిర్మూలన గురించి బోలెడన్ని కబుర్లు చెప్పారు…కహానీలు వినిపించారు. మోడీ కూడా అదే సోది చెప్పి అధికారంలోకి వచ్చారు. అవినీతి నిర్మూలన కోసం రెండున్నరేళ్ళలో చేసింది మాత్రం శూన్యం. కానీ మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలలో మాత్రం అదే అవినీతి అస్త్రాన్ని ఆలంబనగా చేసుకోవాలనుకుంటున్నాడు మోడీ. ఈ సారి కూడా మోడీ పబ్లిసిటీ స్టంట్స్‌కి ఓటర్లు ఫ్లాట్ అవుతారంటారా? మోడీ పబ్లిసిటీ డైలాగులు పనిచేస్తాయా?