ఎదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే.. ప్రధాని మోదీ, అమిత్ షా ఆయా రాష్ట్రాల్లో ఆరు నెలల ముందు నుంచే తిరిగేస్తూ ఉంటారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ , చత్తీస్ గఢ్‌లలో ఇప్పటికే ఈ బీజేపీ అగ్రనేతలు ఒకటి , రెండు రౌండ్ల యాత్రలు పూర్తి చేశారు. కానీ.. ఎన్నికలు జరగాల్సి ఉన్న తెలంగాణలో మాత్రం ఇంకా ప్రారంభించలేదు. లేటవుతుందని అనుకున్నారేమో కానీ మధ్యప్రదేశ్ లోనే … కేసీఆర్ పై విమర్శలు చేశారు.
జూన్ లోనే అమిత్ షా, మోదీ టూర్లు ఖరారయ్యాయి. కానీ తుపాను కారణమంగా షా టూర్ క్యాన్సిల్ అయింది. మోదీ టూర్ కూడా క్యాన్సిల్ అయింది. ఎందుకో తెలియదు. కానీ వచ్చే నెల రెండో వారంలో వస్తారని బీజేపీ నేతలు నేతలు ఆశపడుతున్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్‌ల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేయాల్సి ఉందని … జూలై పదో తేదీ తర్వాత రావొచ్చని అంటున్నారు. వరంగల్ సభ నిర్వహించాలని అనుకుంటున్నారు.
క్షేత్ర స్థాయిలో పర్యటనల కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది బీజేపీ బూత్ కమిటీ సభ్యులను తెలంగాణకు తీసుకు వస్తున్నారు. భోపాల్‌లో మంగళవారం జరిగిన ‘మేరా పోలింగ్ బూత్… సబ్సే మజ్బూత్’ కార్యక్రమంలో పాల్గొన్న వీరు ప్రత్యేక రైలులో రాష్ట్రానికి చేరుకున్నారు. మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్‌లలో మూడు బృందాలుగా విడిపోయి… పార్టీ కోసం ప్రచారం చేస్తారు. హైదరాబాద్ వేదికగా జులై 8న ఏకంగా 11 రాష్ట్రాల భాజపా అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలతో అయినా ఊపు తెచ్చుకోవాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.