ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారయింది. నవంబర్ 11న విశాఖకు రానున్నారు. 400కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేస్తారు. మరిన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే బీజేపీ నేతలు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్ లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పర్యటన ఖరారయిన తర్వాతనే మంత్రి బొత్స సత్యనారాయణ.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు ప్రధానిని ఆహ్వానిస్తామని బోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయిస్తామని ప్రకటించారు. నిజానికి ఆయన పర్యటనలో బోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన ఉందో లేదో స్పష్టత లేదు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల రాజమండ్రిలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చారు కానీ ఇలా. అభివృద్ధి పనుల కోసం మొదటి సారి వస్తున్నారు. విశాఖ రైల్వే జోన్ అంశం పెండింగ్‌లో ఉండగా… రైల్వే స్టేషన్‌ను మాత్రం నాలుగు వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. రైల్వే జోన్ ప్రకటించినా ఇంత వరకూ అమలు విషయం తేలలేదు. విశాఖ వస్తున్న మోదీ ఈ అంశంలో క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.
అలాగే బోగాపురం ఎయిర్ పోర్ట్ అనేది టీడీపీ హయాంలోనిది. అన్ని అనుమతులు వచ్చిన తరవాత నిర్మాణం ప్రాంరభించకపోవడంతో పెండింగ్‌లో పడిపోయింది. మళ్లీ కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం ఇంతవరకూ అనుమతిచలేదు. ఈ భోగాపురం కేంద్రంగానే వైసీపీ నేతలు స్కాములకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో జీఎంఆర్‌కు ఈ ఎయిర్ పోర్టు కాంట్రాక్ట్ వచ్చింది. జగన్ సర్కార్ వచ్చాక కాంట్రాక్ట్ ను రద్దు చేసి.. ఐదు వందల ఎకరాలు తగ్గించి మళ్లీ జీఎంఆర్ కే కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ అవకతవకలతో అసలుకే అనుమతులు పెండింగ్‌లో పడిపోయాయి.
ఏపీకి వస్తున్న ప్రధాని మోదీని విభజన హామీలపై ఎవరూ ప్రశ్నించే అవకాశమే లేదు. ఏపీ రాజకీయ పార్టీలన్నీ బీజేపీకి దాసోహంగానే ఉన్నాయి. అయితే మోదీ పర్యటన తర్వాత రాజకీయాల్లో మాత్రం ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.