కేంద్రమంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ప్రధానమంత్రి మోడీ కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు. ఇరవైఏడు మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ప్రాబబుల్స్ ను కూడా మీడియాకు లీక్ చేశారు. అంత వరకూ బాగానే ఉంది..కానీ ఈ ప్రాబబుల్స్‌లో కూడా… ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరంటే ఒక్కరికీ చాన్స్ దొరకలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో వారికి మాత్రమే ప్రాధాన్యంఇవ్వబోతున్నారు. అలాగే మంత్రి పదవులు ఆశ చూపి పార్టీలో చేర్చుకున్నవారికీ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. రెండో సారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన నరేంద్రమోడీ… ఆ తర్వాత మరోసారి విస్తరణ చేపట్టలేదు.
రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చిన ప్రతీసారి కేంద్ర మంత్రివర్గంలో మార్పుచేర్పులు చేయడం బీజేపీ అధినాయకత్వం చేసే ప్రక్రియ. ఈ మధ్య కాలంలో చాలా మందిని మంత్రి పదవులు ఆశ చూపించి పార్టీలో చేర్చుకున్నారు. జ్యోతిరాదిత్య సింధియాలాటి వాళ్లు ఉన్నారు. వారందరికీ అవకాశాలు కల్పించాల్సి ఉంది. మంత్రివర్గ విస్తరణ ప్రచారం జరిగిన ప్రతీ సారి వార్తల్లోకి వచ్చే పేరు ఏపీ. దేశంలో కేంద్రమంత్రి పదవి లేని ఒకే ఒక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ,తమిళనాడు, కేరళలకు కూడా మంత్రులుఉన్నారు. కానీ ఏపీకి మాత్రం లేరు. బీజేపీకి కానీ.. అధికారిక మిత్రపక్షాలకు కానీ ఎంపీలు ఎవరూ లేకపోవడం… మొదట్లో చోటు కల్పించలేకపోవడానికి ఓ కారణం అనుకున్నారు.
అయితే ఆ తర్వాత టీడీపీ ఎంపీల్ని చేర్చుకున్నారు. బీజేపీలోవిలీనం చేసుకున్నారు. సుజనా చౌదరికి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారని అప్పుడే ప్రచారం జరిగింది.కానీ ఏం జరిగిందో కానీ.. మొత్తం సైలెంట్ అయిపోయింది. ఏపీకి ఒక్క కేంద్రమంత్రి కూడా లేకపోవడం వల్ల… రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి పట్టించుకునేవారు కరవయ్యారు. అలాగే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కేంద్రమంత్రి పదవి అటూ ప్రచారం చేశారు. ఇదంతా ఊహాగానాలేనని తేలిపోయింది.