ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు… నిర్వివాదాంశం! కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేశారు.. కచ్చితంగా మంచి నిర్ణయమే! గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేనంత ధైర్యమైన చర్య… ఇదీ వాస్తవమే. ఈ నిర్ణయాన్ని భాజపా సాధించిన ఘనవిజయంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకున్నారు… అదీ సహజమే. అయితే, ఈ అంశాన్ని అక్కడితో వదిలేయకుండా… ఇంకా ఇంకా సాగదీస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకా వాడుకునే ప్రయత్నమే భాజపా చేస్తోంది. ప్రతిపక్షాలకు సవాళ్లు చేసేందుకు కూడా ఇంకా ఆర్టికల్ 370 రద్దునే వాడుకుంటోంది! ఇతర నాయకుల ఎవరైనా ఇలాంటి సవాళ్లు చేస్తే సర్లే అనుకోవచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా సవాళ్లకు దిగుతుంటే ఏమనుకోవాలి?
మహారాష్ట్రలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ… కాశ్మీరు విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచమంతా మెచ్చుకుంటోందన్నారు! దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు. జమ్మూ కాశ్మీరులో ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీలో అంటోందని ఆరోపించారు. కాంగ్రెస్, ఎన్సీపీ నేతలకు నిజంగానే దమ్ముంటే ఆర్టికల్ 370 మళ్లీ తెస్తామంటూ వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టగలరా అంటూ సవాల్ చేశారు. అలాంటి ప్రయత్నమే చేస్తే కాంగ్రెస్, ఎన్సీపీ మటాష్ అయిపోతాయని హెచ్చరించారు. దాదాపు ఇదే స్థాయిలో హోంమంత్రి అమిత్ షా కూడా మాట్లాడుతున్నారు! కాశ్మీరుకి స్పెషల్ స్టేటస్ ని మోడీ రద్దు చేశారనీ, గత ప్రధానులకు లేని దమ్మూ ధైర్యం మోడీకి ఉన్నాయి కాబట్టే ఇలాంటి సాహసోపతమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు అమిత్ షా!
కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా కాశ్మీరులో మారిన పరిస్థితులు, అక్కడి ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రధాని మాట్లాడితే బాగుంటుంది. అంతేగానీ, ఇలా రెచ్చగొట్టే విధంగా దమ్ముంటే మళ్లీ 370 తీసుకురండి అని ప్రధాని స్థాయిలో ఉన్నవారు సవాల్ చేయడం సరైంది కాదు! కాశ్మీరులో శాంతి కోరి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ శాంతికాముక దృష్టితోనే ప్రధాని మాటలుండాలి. హోంమంత్రి అమిత్ షా కూడా అంతే… గత ప్రధానులకు దమ్ము లేదంటున్నారు! కాశ్మీరు అంశంలో భాజపా తీసుకున్న నిర్ణయం మోడీ వ్యక్తిగత ధైర్య సాహసాల ప్రదర్శన కోసం జరిగింది కాదు కదా, కొన్నేళ్లుగా అక్కడ నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే క్రమం కదా!