ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాలా క్రిస్టల్ క్లియర్ విజన్‌తో ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మేస్తామని తేల్చేస్తున్నారు. ఇందు కోసం మంత్రులతో ఓ కమిటీని నియమించారు. వీలైనంత త్వరగా అమ్మకం ప్రక్రియ పూర్తయిపోతుంది. స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన సమగ్ర వివరాలను పంపించాలని అధికారులకు కేంద్రం నుంచి సమాచారం అందింది. ఆ పనిలో వారున్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై తన ఆలోచనను బహిరంగంగానే వెల్లడించారు. వ్యాపారం ప్రభుత్వం పని కాదని తేల్చేశారు. అందుకే… పీఎస్‌యూలన్నింటినీ అమ్మి పడేస్తామని ప్రకటించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వహించడం భారంగా మారిందని.. ప్రజలను పట్టించుకోవాల్సిన అధికారులు.. వ్యాపారంలో తలమునకలుగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. కేవలం నాలుగు రంగాల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు ఉంటాయని.. మిగతా అన్ని రంగాల్లో అమ్మేసి.. రూ. రెండున్నర లక్షల కోట్లను ఆర్డిస్తామని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆలస్యం కూడా జరగదని ఆయన విశ్వాసంతో ఉన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ అనే మాటను చాలా కాలంగా వింటున్నా.. ఎక్కడా వేగంగా సాగలేదు.
దీనికి కారణాలు ఏమైనా.. మోడీ సర్కార్ మాత్రం ఇప్పుడు… పెద్ద ఎత్తున డిజిన్వెస్ట్ మెంట్ ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటోంది. ప్రభుత్వ రంగ వ్యాపారం అనేది ఉండకూడదని.. మోదీ ఆకాంక్షగా కనిపిస్తోంది. ఈ విధానాల కారణంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఇప్పటికే ఉద్దృతంగా సాగుతోంది. త్వరలో అమ్మాలనుకుంటున్న సంస్థలన్నీ అదే దారి పట్టే అవకాశం ఉంది.