వైఫల్యాలను విజయాలుగా ప్రచారం చేసుకోవడంలో నరేంద్రమోడీ స్టైలే వేరు. కొత్త ఏడాది సందర్బంగా.. ఏఎన్ఐ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్యూలో… జీఎస్టీ, నోట్ల రద్దు, బడాబాబుల పరారీ .. అన్నీ తాము సాధించుకున్న విజయాలేనన్నట్లుగా చెప్పుకున్నారు. మహాకూటమి ఫెయిలందని తీర్పిచ్చారు. మూడు రాష్ట్రాల్లో పరజయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. అక్కడి ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత వల్లేనని తేల్చేశారు. 15 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అలాంటి ఫలితాలు సహజమేనని వ్యాఖ్యానించారు. గెలుపు, ఓటమి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. మూడు రాష్ట్రాల్లో ఓడినంత మాత్రాన ఆత్మవిశ్వాసం దెబ్బతినదని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న పరిపూర్ణ నమ్మకంతో బీజేపీ ఉందన్నారు.
మోదీ కోసమే కేసీఆర్ ఫ్రంట్ సన్నాహాలు చేస్తున్నారన్న చంద్రబాబు విమర్శలను మోడీ తోసి పుచ్చారు. అసలు తనకు కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారన్న విషయమే తెలియదని ప్రకటించేశారు. చంద్రబాబు తెలంగాణపై ద్వేషంతో రాజకీయం చేయాలనుకున్నారు అందుకే ఓడిపోయారని చెప్పుకొచ్చారు. తెలంగాణకు అనుకూలమైన రాజకీయం చేసినట్లు మోడీ చెప్పుకున్నా మ బీజేపీ కూడా 95 శాతం సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన విషయాన్ని ఆయన గంభీరంగా మర్చిపోయారు. చంద్రబాబు ఆక్రోశంతో ఏదేదో మాట్లాడుతున్నారని .. అసలు మహాకూటమి అనే మాటకే అర్థం లేదనేశారు. తెలంగాణలో మహాకూటమి గతి ఏమైంని ప్రశ్నించారు.
జీవితాంతం కాంగ్రెస్‌ను వ్యతిరేకించినవారు.. వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నుంచి వచ్చినవారు మహాకూటమి అంటున్నారు అలాంటి రాజకీయాలతో లాభం లేదని తేల్చేశారు.
పెద్ద నోట్ల రద్దు లక్ష్యం ఏమిటో.. ఇప్పటి వరకూ సరిగ్గా చెప్పలేకపోయిన మోడీ.. ఇంటర్యూలో మాత్రం ఓ కొత్త అంశాన్ని చెప్పుకొచ్చారు. పెద్ద నోట్ల రద్దు లాంటి చర్యలతో స్వచ్ఛమైన, స్పష్టమైన విధానం తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు బ్యాంకింగ్ కార్యకలాపాలు పారదర్శకంగా ఉన్నాయని సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. మరి నల్లధనం, క్యాష్ లెష్ లక్ష్యాలు ఏమయ్యాయో మాత్రం వదిలేశారు. కొత్తగా రైలు పట్టాలు వేస్తున్నప్పుడు కొంతకాలం ఇబ్బంది ఉంటుందని .. వృద్ధిరేటుపై నోట్ల రద్దు ప్రభావం కూడా అంతేనని విచిత్రమైన కంపేరిజర్ తెచ్చారు. వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి బడబాబులు పారిపోవడంపై.. మోడీ అదీ తమ ఘనత అన్నట్లుగా చెప్పుకున్నారు. తమ హయాంలో అక్రమాలకు పాల్పడే అవకాశం లేక దేశం వదిలి పోరిపోయారని చెప్పుకొచ్చారు. త్వరలోనే వారిని దేశానికి రప్పిస్తాం.. బాకీలు కట్టిస్తామని రొటీన్ డైలాగ్ చెప్పారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ కట్టుబడి కోసం.. గతం చెప్పిన హామీలును మాత్రం ప్రస్తావించలేదు. మోదీ వచ్చిన ఐదేళ్లలో చెప్పుకోదగ్గ పనులు జరగలేదని.. చేసిన పనులేమైనా ఉంటే చెప్పాలని.. విపక్షాలు చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు… ఏం చేశారో వివరించలేకపోయారు.
ముందు చూపు లేకుండా జీఎస్టీని… దేశంపై రుద్దారన్న విమర్శలను.. అన్ని పార్టీలపై.. ముఖ్యంగా కాంగ్రెస్ పై రుద్దే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే జీఎస్టీ రూపురేఖలు సిద్ధమయ్యాయని… జీఎస్టీ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు.. జీఎస్టీ కౌన్సిల్లో చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ ఉందన్నారు. లోటుపాట్లకు కాంగ్రెస్‌ది బాధ్యతేనని… మోడీ ప్రతిపక్ష పార్టీపైకి తోసేశారు. రుణమాఫీ హామీ ఇవ్వబోవడం లేదని.. పరోక్షంగా చెప్పారు. రుణమాఫీ ఎప్పుడూ రైతులకు ఉపయోగపడలేదన్నారు. రుణమాఫీతో రైతుల జీవితాలు మారిపోతాయంటే సిద్ధమేనని దేవీలాల్ హయాం నుంచి రుణమాఫీ చేస్తున్నారు… కానీ రైతుల జీవితాల్లో ఎందుకు మార్పురాలేదని వ్యాఖ్యానించారు. పొలం నుంచి మార్కెట్ వరకు అన్ని స్థాయిల్లో మార్పు తెచ్చి… రైతుల జీవితాలు బాగుపడేలా చేస్తానన్నారు. ముస్లింలపై దేశంలో ఎలాంటి వివక్ష లేదని మోదీ స్వయం సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఏ వర్గంపై అయినా కక్షపూరితంగా వ్యవహరించడం. లేదన్నారు. భారత్‌లో హిందూ, ముస్లింల ఐక్యత చూసి అందరూ నేర్చుకోవాలని సలహా కూడా ఇచ్చారు. ట్రిపుల్ తలాక్ అనేది ఇస్లాంలో ఎక్కడా లేదుని… అందుకే చట్టం చేస్తున్నామని.. రాజకీయం చేయడం సరికాదన్నారు. రాఫెల్ విషయంలో.. తాను చెప్పాల్సిందేమీ లేదని..సుప్రీంకోర్టు తీర్పే చెప్పందని తప్పించుకున్నారు.