ఒక దేశ ప్రధాన మంత్రి ఏ డిగ్రీ చదివారు, ఆ డిగ్రీ అసలైందా కాదా అనే చర్చ బహుశా ప్రపంచంలో మరెక్కడా జరిగి ఉండదు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏ డిగ్రీ చదివారనేది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిగులు పట్టుకుంది. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు రాబట్టడానికి చాలా కష్టపడ్డారు. అయితే ఆయన ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బి ఎ, గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎం ఎ పొలిటికల్ సైన్స్ పాసయ్యారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సర్టిఫికెట్ల కాపీలు బయటపెట్టారు.
మోడీ డిగ్రీలపై అసత్యాలను ప్రచారం చేయడం ద్వారా భారత దేశ ఇమేజిని కేజ్రీవాల్ మసకబార్చారని అమిత్ షా ఆరోపించారు. దేశానికి కేజ్రీవాల్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపిస్తుంటే ఆయన పరువు తీయడానికి ఆప్ నేతలు కంకణం కట్టుకున్నారని విమర్శించారు.
ఆతర్వాత గంటలోనే ఆమ్ ఆద్మీ పార్టీ వారు రంగంలోకి దిగారు. మొన్నటి వరకూ సీనియర్ జర్నలిస్టు అయిన అశుతోష్, మరికొందరు నేతలతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. మోడీ డిగ్రీలంటూ అమిత్ షా చూపించినవి ఫోర్జరీ సర్టిఫికెట్లని ప్రకటించారు. బి ఎ డిగ్రీలో పేరు నరేంద్ర కుమార్ దామోదర్ దాస్ మోడీ అని ఉందన్నారు. ఎం ఎ సర్టిఫికెట్ లో నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అని ఉందన్నారు. ఒకవేళ మోడీ పేరు మార్చుకుని ఉంటే ఆ అఫిడవిట్ ఏదని ప్రశ్నించారు.
బి ఎ పాసైన సంవత్సరంలోనూ అనుమానాలున్నాయని చెప్పారు.
నిజానికి, ఇది అసలు విషయమే కాదని, నాన్ ఇష్యూ అని చాలా మంది అభిప్రాయం. బీజేపీ నేతలు మీడియా ముందుకు వచ్చే వరకూ కేజ్రీవాల్ ఎంత మొత్తుకున్నా ప్రజలు పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మోడీ ఎం ఎ చదివారనే చాలా మంది నమ్మారు. సామాన్య ప్రజల్లో చాలా మంది ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. బీజేపీ అనవసరంగా కేజ్రీవాల్ కు ప్రాధాన్యం ఇవ్వడానికే మీడియా సమావేశం పెట్టినట్టయింది. ప్రభుత్వాన్ని నడపడంలో సత్తా లేకపోయినా ఇతరుల మీద రాళ్లు వేయడంలో ఆప్ నేతలు చాలా మంది సిద్ధహస్తులని విమర్శలున్నాయి. తమకు నచ్చని ప్రతి ఒక్కరినీ దొంగ అని తిట్టడం కేజ్రీవాల్ కు బాగా అలవాటు. అందుకే పరువునష్టం దావాలు ఎదుర్కొంటున్నారు. అవినీతిని నిరూపించకపోతే జైలుకు పోయే రిస్కును కూడా ఎదుర్కొంటున్నారు.
కాబట్టి ముందు ముందు కూడా బీజేపీ నేతలను మరింత ఇబ్బంది పెట్టడానికి ఆప్ మేధావులు బాగానే ప్రయత్నిస్తారంటున్నారు పరిశీలకులు. పనికిమాలిన విషయం తప్ప మరేం దొరకలేదా అని ఆప్ నేతలను విమర్శించే వారూ ఉన్నారు. ఆప్ అడిగిన ప్రశ్నలకు మోడీ జవాలు చెప్పాల్సిందే అనే వాళ్లూ ఉన్నారు. అయితే, అనవసరంగా దీనిగురించి టీవీ స్టుడియోల్లో గంటల కొద్దీ చర్చలు అవసరమా అనేది అసలు ప్రశ్న. చాలా మంది పరిశీలకుల అభిప్రాయం అదే.