విలన్ ప్రధాన అనుచరుడితో కలిసి ఓ సినిమాలో పోలీసులు టీ తాగుతారు. ఆ విషయం ఇతర అనుచరులు విలన్ కి చెబుతారు. దాంతో ఆ విలన్ తన ప్రధాన అనుచరుడిపై అనుమానంతో… అతన్నీ చంపేయమని ఇతర అనుచరులను ఆదేశిస్తాడు. ఇది హీరో ప్లాట్. విలన్ నుంచి ప్రధాన అనుచరుడ్ని దూరం చేయడమే కాదు.. ఇన్ఫార్మర్గా మల్చుకుంటాడన్నమాట. రాజకీయాల్లోనూ ఇవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ప్రత్యర్థి నేతల్ని విపరీతంగా పొగిడేసి.. సొంత పార్టీకి దూరం చేసి.. తనకు అనుకూలంగా మల్చుకోవడం లేదా.. ఉన్న పార్టీకి దూరం చేయడం లాంటి వ్యూహం అమలు చేస్తూ ఉంటారు. రాజ్యసభలో కాంగ్రెస్ కీలక నేత గులాంనబీ ఆజాద్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురయింది. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని మోడీ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అందరూ అవాక్కవ్వాల్సి వచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాలా ఎమోషనల్. ఎంతగా అంటే.. ప్రతిపక్ష నేత ఆజాద్ పదవీ కాలం అయిపోతోందని.. వీడ్కోలు ప్రసంగంలో ఆయన గురించి మాట్లాడుతూ.. కన్నీరు పెట్టేసుకున్నారు. ఆయన అంత ఎమోషనల్ కావడం చూసి ఇతర సభ్యుల కళ్లు కూడా చెమ్మగిల్లాయి. ఈ అరుదైన… దృశ్యం రాజ్యసభలో కనిపించింది. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ పక్షనేతగా గులాం నబీ ఆజాద్ ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగిసిపోతోంది. మరోసారి ఆయన ఎన్నిక కాలేదు. కాంగ్రెస్ పార్టీకి ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపించేంత బలం లేదు. ఒక వేళ ఉన్నా.. ఆయనను పంపుతారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో ఆయనకు గ్యాప్ వచ్చింది. గతంలో కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన సీనియర్ల లేఖ అంశంలో ఆజాద్ ది కీలక పాత్ర.
ఇప్పుడు.. ఆయన పదవీ విరమణ చేస్తూంటే.. తన సొంత పార్టీ సభ్యుడు సభ నుంచి దూరమవుతున్నారన్నంతగా మోడీ ఫీలైపోయారు. గతంలో ఎప్పుడూ ఆజాద్‌లో… మోడీకి అంత గొప్ప అనుబంధం ఉన్న సంఘటనలు లేవు. మరి ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారో కొంత మందికి మాత్రమే అర్థం అయిది. అయితే అందరికీ అర్థం కావాలని… ఎప్పుడో.. తాను గుజరాత్ సీఎంగా ఉండగా… కశ్మీర్లో గుజరాత్ టూరిస్టులపై జరిగిన దాడి అంశం… అప్పుడు సీఎంగా ఉన్న ఆజాద్ స్పందించిన వైనం గుర్తు చేసుకున్నారు. ఇతర రాజ్యసభ సభ్యులు ఓ.. అదా అనుకున్నారు.
అసలు విషయం.. ఆజాద్‌తో కాంగ్రెస్ పార్టీ గ్యాప్ పెంచడానికి మోడీ ఇలా సెంటిమెంట్ రాజకీయం నడిపారని.. అందు కోసం రెండు కన్నీటి చుక్కలు వినియోగించారని… కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి సీనియర్లు రాసిన లేఖపై దుమారం రేగినప్పుడే.. ఆయన బీజేపీలో చేరుతారన్న చర్చ జరిగింది. బహుశా.. ఇప్పుడు ఆయనతో అంత ఎమోషనల్ టచ్ ఉందని మోడీ అనుకున్నప్పుడు.. ఆజాద్ కూడా అనుకుంటే అదే జరిగే చాన్స్ ఉండొచ్చు. రాజకీయం అంటే అంతే కదా..!