నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత.. ఈ దేశంలో గడిపిన సమయం కంటె.. విదేశాలలో గడిపిన సమయమే చాలా ఎక్కువగా ఉంటుందని.. మితిమీరిన ఆయన విదేశీటూర్ల వ్యామోహం మీద సోషల్ మీడియాలో అనేక జోకులు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అందులో అబద్ధం ఎంతమాత్రమూ లేదు. భారత్ వంటి ఒక పెద్ద దేశానికి ప్రధానిగా ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు కలిగి ఉండడం, ఆ అవసరాల నిమిత్తం వెళ్లడం తప్పేమీ కాదు. కానీ ఆ మాత్రం శ్రద్ధను సొంత దేశం మీద కూడా పెట్టాలనే కనీసం నాయకత్వ సూత్రాన్ని ఆయన విస్మరిస్తున్నారని అనాల్సిందే. ప్రధాని అయిన తర్వాత.. మోడీ కనీసం ఒక్కసారి కూడా కాలు పెట్టని రాష్ట్రాలు అనేకం ఉన్నాయి. అలాగే.. ఎన్నికలు వస్తే మాత్రమే కాలుమోపిన రాష్ట్రాలు కూడా అనేకం ఉన్నాయి. అంతటి అవకాశ వాద నాయకుడుగా ముద్ర పడుతున్న మోడీ.. సరిగ్గా ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ టూర్ల మీద తగలేసిన మొత్తం ఎంతో తెలుసుకుంటే మనకు గుండె గుభిల్లుమంటుంది.
2015-16 ఆర్థిక సంవత్సరంలో మోడీ విదేశీ పర్యటనల వలన ఎయిర్ ఇండియా వారికి పడిన భారం 117 కోట్ల రూపాయలు. గత ఏడాది ప్రధాని టూర్ల వలన పడిన ఖర్చు కంటె ఇది 25 శాతం ఎక్కువ. ఈ ఏడాదిలో మోడీ మొత్తం 22 దేశాల్లో పర్యటించారు. వాటిలో రష్యా ఫ్రాన్స్, జర్మనీ, కొరియా, మంగోలియా, చైనా, యూఏఈ, ఐర్లాండ్, యూకే, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, టర్కీ వంటివి ఉన్నాయి. సమాచార హక్కు ద్వారా వచ్చిన ఒక దరఖాస్తుకు సమాధానంగా ఎయిర్ ఇండియా ఈ వివరాలను వెల్లడించింది.
ఇది కేవలం మోడీ విదేశీ టూర్ల వ్యామోహం వలన ఎయిర్ ఇండియాకు అయిన ఖర్చు మాత్రమే. అదే సమయంలో ఆయన పర్యటన సందర్భంగా ఇతర ఖర్చులు, ఆయన వెంబడి వెళ్లే వందిమాగధులు, అధికార గణాలు, వారి సేవలకు అయ్యే ఖర్చులు తదితరాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఇంతకు నాలుగురెట్లు ఉన్నా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ఈ సంగతి వింటే మనకు కండుపుమంట తగ్గకపోవచ్చు. మరింతగా రగిలిపోవచ్చు. దాదాపు 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు అవసరం అనుకుంటున్న పోలవరం ప్రాజెక్టుకు 2016-17 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తం నిధులు కేవలం వంద కోట్ల రూపాయలు. ఒక జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి అంత స్వల్పనిధులు కేటాయిస్తే తమ ప్రభుత్వానికే సిగ్గుపోతుందనే వెరపు కూడా వారికి కలిగినట్లు లేదు. మన ప్రాజెక్టులకు కేవలం 100 కోట్ల ముష్టి విదిలిస్తారు. అదే సమయంలో ఆయన విదేశీ టూర్లకు మాత్రం కేవలం విమాన ఖర్చులకే ఈ ఏడాదిలో 117 కోట్లకు మించి తగలేసేస్తున్నారంటే కడుపుమండకుండా ఎలా ఉంటుంది?