వచ్చే ఎన్నికల్లో ఒడిశాలోని పూరీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తారనే ప్రచారం మెల్లగా మొదలైన సంగతి తెలిసిందే. అయితే, రెండ్రోజుల కిందట ఎ.ఎన్.ఐ.కి ప్రధాని ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దీన్లో కూడా ఈ ప్రస్థావన వస్తే… ఆయన కొట్టి పారేశారు. ఇదంతా మీడియా సృష్టి అన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసేదనే అంశంపై ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదన్నట్టుగా ఆయన స్పందించారు. అయితే, మోడీ ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా… ఆయన పూరీ నుంచి పోటీ చేసే అవకాశాలు చాలా ఉన్నాయంటూ ఒడిశాకు చెందిన భాజపా ఎమ్మెల్యే ప్రదీప్ పురోహిత్ మీడియా ముందుకు రావడం విశేషం!
గత లోక్ సభ ఎన్నికల్లో కూడా పూరీ జగన్నాథుని ఆశీస్సులు తీసుకున్నాకనే వారణాసి నుంచి మోడీ పోటీ చేసి ఘనవిజయం సాధించారని పురోహిత్ గుర్తు చేశారు. ఆయనకు ఒడిశా ప్రజలంటే చాలా అభిమానమనీ, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆయన ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారని పురోహితం చెప్పారు. ఒడిశా ప్రజలు కూడా ఈసారి మోడీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని బలంగా కోరుకుంటున్నారనీ, రాష్ట్ర పార్టీ నేతలు కూడా ఇదే అంశాన్ని ఆయన ముందుంచేందుకు మరోసారి ప్రయత్నిస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఒడిశా ప్రజల ఆశల్ని ఆయన అర్థం చేసుకుంటారనీ, నూటికి తొంభై శాతం పూరీ నుంచే మోడీ పోటీ ఉంటుందని పురోహిత్ చాలా నమ్మకంగా చెప్పేశారు.
గత ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసి, ఉత్తరప్రదేశ్ లో అన్ని సీట్లూ భాజపా గెలుచుకునేలా మోడీ చేశారు. కానీ, రాబోయే ఎన్నికల్లో మోడీ హవా ఆ స్థాయిలో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పైగా, ఉత్తరప్రదేశ్ లో భాజపాకి అస్సలు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే అక్కడి రాజకీయాలు ఈ మధ్య ఎలా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాయి. ఎస్పీ, బీఎస్పీ ఈసారి భాజపాకి గట్టిపోటీ ఇవ్వడం ఖాయం. దీంతో, మరోసారి ప్రధాని వారణాసిలో పోటీ చేసి గెలిచినా, గత ఎన్నికల్లో మాదిరిగా రాష్ట్రంలోని అన్ని లోక్ సభ స్థానాల్లో మోడీ ప్రభావం మరోసారి కొనసాగుతుందనే నమ్మకం ఆ పార్టీకి పూర్తిగా లేదని చెప్పొచ్చు. కాబట్టి, మరో టెంపుల్ టౌన్ కి మోడీ వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. అదే, ఒడిశాకి వెళ్లడం ద్వారా అక్కడా భాజపా పుంజుకుంటుందనే ఆశలు ఆ పార్టీకి ఉన్నాయి. అందుకనే, పూరీ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఒడిశా ప్రజల నుంచే వస్తోందనే వాదనను తెరమీదికి తెస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నికల దగ్గరపడ్డాక, పరిస్థితులను అప్పుడు క్షుణ్ణంగా అంచనా వేసుకుని… అవసరమైతే పూరీ నుంచి పోటీ చేసే అవకాశాన్ని ప్రత్యామ్నాయ వ్యూహంలో భాగంగా రెడీ చేసి ఉంచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.