హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడి అమెరికాలో జరుపుతున్న రెండో పర్యటనకూడా విజయవంతమయింది. ఇప్పుడు అమెరికాలో ఎక్కడ చూసినా మోడి పేరు మార్మోగుతోంది. గత ఏడాది పర్యటనలో మేడిసన్ స్క్వేర్‌లో గుక్కతిప్పుకోకుండా ఇచ్చిన ఉపన్యాసంతో ప్రవాస భారతీయులను బుట్టలో వేసుకుంటే, ఈ ఏడాది శాన్ జోస్ సిలికాన్ వ్యాలీలో, ఫేస్బుక్ ప్రధాన కార్యాలయం క్యాలిఫోర్నియాలో సెంటిమెంట్ జోడించిన ఉపన్యాసాలతో అమెరికా పారిశ్రామికవేత్తలను, సీఈఓలను ఆకట్టుకున్నారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే బంద్‌గళా సూట్లు, వేస్ట్ కోట్లు, నెహ్రూ జాకెట్లు ధరించి అదరగొట్టేస్తున్నారు. సిలికాన్ వ్యాలీలో మోడి సీఈఓల సదస్సులో పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, శాప్ సంస్థల సీఈఓలతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. మోడి రూపకల్పన చేసిన డిజిటల్ ఇండియాకు సాయమందిస్తామని గూగుల్, మైక్రోసాఫ్ట్, క్వాల్కామ్ సంస్థలు ముందుకొచ్చాయి. తర్వాత మోడి యాపిల్ సంస్థ అధినేత టిమ్ కుక్‌తో విడిగా సమావేశమై, యాపిల్ ఉత్పత్తులపై భారత్‌లో ఉన్న మోజుగురించి చర్చించారు. టెస్లా కార్ల ఫ్యాక్టరీని సందర్శించారు. బయో ఇంధనం, పర్యావరణ హితమైన వాహనాల తయారీ గురించి ముచ్చటించారు. అంతకుముందు రోజు న్యూయార్క్‌లో అమెరికా ఆర్థిక రంగానికి చెందిన టాప్ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. సంస్కరణలను కొనసాగిస్తున్నామని, భారత్‌లో పెట్టుబడులు పెట్టటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మొత్తంమీద చూస్తే నరేంద్ర మోడికి సొంతగడ్డమీదకంటే విదేశాలలోనే ప్రజాదరణ బాగున్నట్లుంది. అందుకే అధికారంలోకి వచ్చిన గత 16నెలల కాలంలో 25పైగా దేశాలు చుట్టొచ్చి అతి తక్కువకాలంలో ఎక్కువ దేశాలు పర్యటించిన తొలి భారత ప్రధానిగా ఘనత దక్కించుకున్నారు. అదేసమయంలో గత ఏడాది పార్లమెంట్ సమావేశాలకు అతి తక్కువసార్లు హాజరైన ప్రధానమంత్రిగా కూడా రికార్డ్ సొంతం చేసుకున్నారు. మోడి ఈ పర్యటనలలో ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంపొందించి తద్వారా భారత వాణిజ్యాన్ని అభివృద్ధి చేస్తే ఆ పర్యటనలద్వారా దేశానికి, ప్రజలకు ప్రయోజనం ఒనగూరినట్లే. అయితే మోడి వెళ్ళిన చోటల్లా మేక్ ఇన్ ఇండియా విధానంలో భారత్‌కు వచ్చి పెట్టుబడులు పెట్టి సంపాదించుకోమని చెబుతున్నారు. విదేశీ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పించామని, అనేక కార్మిక చట్టాలను సంస్కరించామని చెప్పటం ఇప్పుడు చర్చనీయాంశమయింది. మరోవైపు మోడిపై మరో ప్రధాన విమర్శ వినబడుతోంది. హైటెక్ కంపెనీలపైన, ఇంటర్నేషనల్ ఇమేజ్‌మీద పెడుతున్నంత శ్రద్ధ, దేశంలోని సామాన్య ప్రజలపై, వారి సమస్యలపై పెట్టటంలేదని అంటున్నారు. 1995-2004 మధ్య సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన చంద్రబాబునాయుడు ఇలాగే టెక్నాలజీవంటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని వ్యవసాయంవంటి మౌలికరంగాలను విస్మరించటం, తద్వారా సామాన్య ప్రజల ఆదరణను కోల్పోవటం అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రధాని ఇలాగే విదేశీ పర్యటనలు చేసుకుంటూ పోతే చంద్రబాబుకు 2004 ఎన్నికలలో నాటి ఏపీ ప్రజలు చెప్పినట్లే దేశప్రజలు మోడికి గుణపాఠం చెప్పితీరుతారు.