సుబ్రహ్మణ్యస్వామికి చాలా తెలివైన వ్యక్తిగా పేరున్నా దీర్ఘకాలం పాటు ఎవరూ దగ్గరకు రానిచ్చేందుకు సిద్దం కాలేదు. కారణం ఆయన వివాదాస్పదుడే గాక అనుమానాస్పదుడు కూడా.ఆయన ఎవరిని విమర్శించినా ఆ వెనక ఎవరో వుండి ఆడిస్తుంటారనే భావంచాలా బలంగా వుంది. కాదు ఆయన నిజాయితీ పరుడని కొంతమంది పొగుడుతుంటారు గాని ట్రాక్ రికార్డు అలా వుండదు. చివరకు స్వతహాగా సంఫ్‌ు పరివార్‌కు దగ్గరైనా వారు కూడా భరించలేక వదిలేయడం ఇందుకు నిదర్శనం. మాజీ ప్రధాని వాజ్పేయిపైన కూడా స్వామి దాడి తెలిసిందే. అన్ని నిర్ణయాలు ఆచితూచి తీసుకునే ప్రధాని మోడీ అలాటి వ్యక్తిని హఠాత్తుగా రాజ్యసభకు తీసుకురావడంలో చాలా రాజకీయం వుందది అందరికీ తెలుసు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఎవరిపై దాడి చేయడానికైనా రెడీగా వుంటారాయన. వచ్చిన రోజునుంచి ఎవరో వొకరిపై బురదజల్లుతూనే ే వున్నారు. సోనియా రాహుల్ గాంధీలపై చేసినప్పుడు బిజెపికి బాగానే వుండింది.కాని తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీపై గురిపెట్టారు. మోడీ ప్రధాని అభ్యర్థి అన్నప్పుడు ఒకింత పోటీగా వినిపించిన పేర్లలో సుష్మా స్వరాజ్, అరుణ్‌జైట్లీ ముఖ్యులు. స్వామి హార్వర్డ్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఆ ముద్రతో మొదట రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామరాజన్పై పడ్డారు. వారి దేశభక్తినే శంకించేలా మాట్లాడారు. రాజన్‌ను జైట్లీ నామకార్థంగా సమర్థించడం తప్ప మరెవరూ బలపర్చలేదు. ఎట్టకేలకు ఆయన ఐచ్చికంగానే తన పదవీ కాలం పొడగింపు కోరడం లేదని ప్రకటించారు. తర్వాత స్వామి ప్రధాని సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యంపై పడ్డారు. తను కూడా విదేశీయుడన్నట్టు మాట్లాడారు. ఈసారి అరుణ్‌జైట్లీ విదేశాల్లో వుండి గట్టిగానే జవాబిచ్చారు. తర్వాత ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌పై పడ్డారు. వీరిని సమర్థించినందుకు ఆరుణ్జైట్లీనే దుయ్యబట్టారు స్వామి. అంటే ఆయనకు నేరుగా ప్రధాని కార్యాలయం ఆశీస్సులే వున్నాయని తేలిపోయింది. క్రమశిక్షణ లేకుండా మాట్లాడొద్దని మంత్రి ప్రకాశ్ జవదేవకర్ అంటే నేను క్రమశిక్షణ తప్పి మాట్టాడితే రక్తపాతాలు తప్పవని బెదిరించారు స్వామి.రక్తపాతం వచ్చేంత విషయాలు ఆయన దగ్గర ఏమున్నాయి? ఉంటే ఎందుకు దాస్తున్నారు? వీటిపై దుమారం రేగిన తర్వాత బ్లడ్‌బాత్ అన్న తన మాటలు అపార్థం చేసుకున్నారని తప్పించుకునే ప్రయత్నం చేశారు.. స్వామి ఎంపి అంటే మోడీ మౌత్ పీస్ గనకనే ఇదంతా చెల్లుబాటవుతున్నట్టు కనిపిస్తుంది.ఇక ఎగిరిఎగిరి ఇప్పుడు ఏడుకొండలపైన పడ్డారు. తిరుమల తిరుపతి దేవస్తానంకూడా వివాదాల్లోకి తీసుకొచ్చారు. దాన్ని ఎవరైనా స్వాములకు పీఠాదిపతులకు ఇవ్వాలి తప్ప ప్రభుత్వాలు నిర్వహించరాదన్నట్టు మాట్లాడారు. దేవాలయాల పాలనా నిర్వహణ పూర్తిగా ప్రభుత్వాల లేదా ప్రభుత్వ సంస్థల బాధ్యత కాకపోతే రక్షణ ఏముంటుంది?వీటిని స్వాములకు పీఠాధిపతులకు అప్పగించాలని స్వామి అంటున్నారు గాని ఏ పీఠం తీసుకోవాలి? వాటిపైన ఎన్ని ఆరోపణలున్నాయి?దేవాలయాల భూములు సంపదలు శాంతిభద్రతలు పారిశుధ్యం వంటి లౌకిక వ్యవహారాలు ప్రభుత్వం లేకుండా నడుస్తాయా? పైగా ఈ విమర్శలో రాజకీయాలు జోడించి తెలుగుదేశంపై విమర్శలు గుప్పించారు. ఏ పార్టీ అధికారంలో వుంటే వారే టిటిడిపైనా అధికారం చలాయిస్తుంటారు. ఇప్పటికే టిటిడి హిందూ ధర్మపరిరక్షణ పేరిట విశ్వహిందూపరిషత్ వంటి సంస్థల కార్యకలాపాలకు ఆరెస్సెస్ ప్రేరిత సాధుసమాగమాలకు సహాయం చేస్తుంటుంది.పూర్తిగా వారికే ధారాదత్తం చేయాలని స్వామి మనోగతమా? ఇంతటి బ్లాక్‌మెయిలింగ్ స్వామికి బ్యాకింగ్ ఇస్తున్న ప్రధాని కూడా ఈ వికృత వివాదాలకు కారకులు కాదా? ఇంత జరిగాక రఘురాం రాజన్ కూడా దేశభక్తిలో ఏ ఒక్కరి కన్నా తక్కువ కాదని ఆయన సన్నాయి నొక్కులు నొక్కారే గాని ఈ తరహా దుర్భాషలు మంచివి కాదని నిశితంగా ఖండించేందుకు మందలించేందుకు సిద్ధ: కావడం లేదు. అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఎంపి అంటే మోడీ మౌత్ పీస్ అని అర్థం చెప్పుకోవచ్చు.