పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సైన్యంపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన హైలెవల్ మీటింగ్ ప్రధాని నివాసంలో జరిగింది. త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రితో పాటు రక్షణ సలహాదారు అజిత్ ధోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు ఎక్కడెక్కడ నక్కి ఉన్నారో స్పష్టత ఉందని.. దాడులు చేయాలనుకుంటే వెంటనే చర్యలు ప్రారంభించవచ్చని త్రివిధ దళాలు సంసిద్ధత వ్యక్ం చేసినట్లుగా తెలుస్తోంది.
వ్యూహం, సమయం, లక్ష్యం అన్నీ సైన్యమే నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీ స్వేచ్చ ఇచ్చారు. అయితే ఉగ్రవాదుల్ని మాత్రం అంతం చేయాలన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ ఇచ్చిన దిశానిర్దేశంతో ఆర్మీ తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత ప్రధాని మోదీ ఇంటికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వచ్చారు. హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆయన ప్రధాని ఇంటికి వచ్చారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలపై భారత్ చేయబోతున్న దాడుల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా మోహన్ భగవత్ కొన్ని సూచనలు ఇచ్చారని అంటున్నారు.
పాకిస్తాన్ పై ఎలాంటి దాడులు ఉండకపోవచ్చని… కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను మాత్రం భారత సైన్యం ధ్వంసం చేయడం ఖాయమని రక్షణ నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి కూడా సన్నద్ధత ఉంది. ఉగ్రవాదుల్ని కాపాడేందుకు ఆ దేశం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపు బలూచిస్తాన్ లో ఉగ్రవాదులు.. పాక్ ఆర్మీని ఊచకోత కోస్తూండటంతో ఆ దేశం రగిలిపోతోంది. భారతే ఆ పనులు చేయిస్తోందని ఆరోపణలు చేస్తోంది.