హైదరాబాద్: నరేంద్రమోడి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేస్తోందన్న వాదనకు బలంచేకూర్చే ఒక సమాచారం తాజాగా వెలుగులోకొచ్చింది. పేద వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లకు బడ్జెట్లో కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరినుంచి రు.10,500 కోట్లనుంచి రు.7,187 కోట్లకు తగ్గించింది. ఇదే కాకుండా మరికొన్ని కీలక రంగాలకుకూడా కేంద్రం బడ్జెట్ కేటాయింపులలో కోత విధించింది. బాలల విద్యారంగానికి 2014-15లో రు.81,075 కోట్లు కేటాయించగా, 2015-16లో ఆ మొత్తాన్ని రు.57,919 కోట్లకు తగ్గించారు. ఇవికాక ఐసీడీఎస్(ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్) పథకానికి రు.18,000 కోట్లనుంచి రు.8000 కోట్లకు, సర్వశిక్షా అభియాన్ పథకానికి రు.28,000 కోట్లనుంచి రు.22,000 కోట్లకు, మధ్యాహ్న భోజన పథకానికి రు.13,000 కోట్లనుంచి రు.9,000 కోట్లకు కోత విధించారు. ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్‌కు మాత్రం రు.2.23 కోట్లను పెంచారు.
మరోవైపు విద్యారంగానికి కేటాయింపులను గణనీయంగా – 2014-15తో పోలిస్తే సుమారు 17% – తగ్గించారు. పాఠశాల విద్యకు నిధులను రు.55,000 కోట్లనుంచి రు.42,210 కోట్లకు, ఉన్నతవిద్యకు రు.800 కోట్లను కోత విధించారు.రక్షణ రంగానికి కేటాయింపులను రు.13,000 కోట్లను, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి రు.9,864 కోట్లనుంచి రు.4,500 కోట్లకు, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ పథకానికి రు.11,000 కోట్లనుంచి రు.3,600 కోట్లకు కోత విధించారు. ఆర్థిక సంవత్సరం మధ్యలో జరిపిన ఈ మార్పులు ఈ ఏడాది జనవరినుంచి అమలులోకి వచ్చాయి.