ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. గుంటూరులో ఆరో తేదీన బహిరంగసభలో ప్రసంగించాల్సి ఉంది. ఈ మేరకు ఉన్నత స్థాయిలో షెడ్యూల్ ఖరారయింది. ఏపీ బీజేపీ నేతలు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే హఠాత్తుగా నరేంద్రమోడీ పర్యటన వాయిదా పడే అవకాశం ఉందన్న సమాచారన్ని ఢిల్లీ బీజేపీ వర్గాలు మీడియాకు లీక్ చేస్తున్నాయి. దానికి విచిత్రమైన కారణాలను బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆరో తేదీన కేరళలో బహిరంగసభ ఉందని.. అక్కడ్నుంచి గుంటూరు రావడానికి సమయం సరిపోదని.. చెబుతున్నాయి.
షెడ్యూల్ ప్రకారం మోదీ జనవరి 6న కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పర్యటించాల్సి ఉంది. ముందుగా తిరువనంతపురంలో జరిగే సభలో పాల్గొని అనంతరం గుంటూరు వస్తారు. అయితే కేరళ బీజేపీ సభను మోడీ సభను తిరువనంతపురంలో కాకుండా శబరిమలలో పెట్టాలని కోరుతోందట. అలా మారిస్తే… బహిరంగ సభ ముగిసిన తర్వాత గన్నవరం రావడానికి మోడీకి సమయం సరిపోదని చెబుతున్నారు. హెలికాఫ్టర్లు, విమానాల ద్వారా మాత్రమే ప్రధాని పర్యటన సాగుతుంది. మరి ఎక్కడ ఎందుకు ఆలస్యం అవుతుందో బీజేపీ నేతలు చెప్పడం లేదు కానీ… కేరళ బహిరంగసభ వేదికను మారిస్తే… మోడీ గుంటూరు రారని మాత్రం చెబుతున్నారు.
నిజానికి మోడీ పర్యటనపై.. మరో ఆలోచన లేకపోతే.. వాయిదా అనే సమాచారమే లీక్ అవ్వడానికి అవకాశం లేదు. ఇలాంటి సమాచారం బయటకు వచ్చిందంటే.. దాదాపుగా వాయిదా పడినట్లే. ఏపీకి మోడీ వస్తే.. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని…బీజేపీ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. వైసీపీ, జనసేన మినహా.. పార్టీలు, ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేస్తామని… ఇప్పటికే ప్రకటించాయి. గతంలో మోడీ తమిళనాడు పర్యటనకు వెళ్లినప్పుడు.. వారు వ్యక్తం చేసిన నిరసన దేశవ్యాప్తంగా హైలెట్ అయింది. అలాంటి పరిస్థితులు ఏపీలో ఏర్పడితే.. ఇబ్బందికరం అవుతుందన్న ఉద్దేశంతో… మోడీ టూర్‌ను వాయిదా వేసే ఆలోచన చేస్తున్నట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.