రైతు రుణమాఫీ అంటూ హడావుడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి… కౌంటర్ ఇవ్వాలని… ప్రధానమంత్రి నరేంద్రమోడీ గట్టి పట్టుదలగా ఉన్నారు. మూడు హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీ ఆధారంగానే గెలిచిందన్న అంచనాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ… రైతులపై… ఈ ప్రభావం గట్టిగా ఉండేలా… ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు… రెండు, మూడు రోజుల్లోనే రుణమాఫీ అమలును ప్రకటించాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని… రాహుల్ పదే పదే చెబుతున్నారు. అదే సమయంలో.. మోడీ కూడా.. ఇలాంటి పథకం ఏదో తెస్తారని అంచనా వేసుకుని.. మోడీతో.. రుణమాఫీ హామీని అమలు చేయిస్తానని సవాల్ చేశారు. లేకపోతే నిద్రపోనివ్వనని చాలెంజ్ చేశారు. ఈ పరిణామాలన్నింటి మధ్య… రైతుల కోసం ఏదో ఓ పథకం పెట్టకపోతే.. మొత్తానికే మోసం వస్తుందని బీజేపీ అగ్రనేతలకు అర్థమయింది.
అందుకే ఇప్పుడు.. రైతులకు నగదు బదిలీ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన ప్రారంభించారు. ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చి నేరుగా రైతుల అకౌంట్లలోకి నిధులు వేయాలన్నది.. ఆ పథకం ఉద్దేశం. దీనికి ఈ “కనీస వార్షిక ఆదాయ పథకం” అని పేరు పెట్టే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నారు కాబట్టి.. హామీ ఇచ్చి ప్రజల్లోకి వెళ్తే నమ్మరు కాబట్టి.. ముందస్తుగా స్కీమ్‌ను ప్రకటించి.. కుదిరితే.. ఓ విడత సొమ్మును రైతు అకౌంట్లలో వేసి.. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే కేంద్రం కసరత్తు ప్రారంభించింది.
ఇందులో విశేషం ఏమిటంటే.. కొత్తగా ఈ పథకానికి నిధులు అవసరం లేదు. ఉన్న పథకాల్నే తీసేసి.. దీన్ని పెడతారట. కేంద్ర పథకాలు అంటే ఆహార సబ్సిడీ , జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సర్వశిక్షా అభియాన్, మధ్యాహ్న భోజనం, ప్రధానమంత్రి ఆవాస్ యోజనా, గ్రామీణ సడక్ యోజనా లాంటి వాటికి కేటాయిస్తున్నారు. అనేక స్కీముల్లో నిధులు పక్కదారి పడుతున్నాయని, లబ్ధిదారులకు చేరడం లేదని కేంద్రం ఇటీవలి కాలంలో వాదించడం ఎక్కువ అయింది. అలాంటి స్కీములన్నింటినీ ఆపేసి ఆ నిధులను నెలనెలా రైతు అకౌంట్లో జమయ్యేట్లు రూపకల్పన చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి రాహుల్‌కు కౌంటర్ వేయడానికి బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.